ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పి, అదే నిజమని నమ్మించే చీకటి యుద్ధం ఇప్పుడు ఏపీలో నడుస్తోందని సీఎం జగన్ అన్నారు. పేదల పక్షాన నిలబడ్డ మీ బిడ్డకు, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న వారికి మధ్య నేడు యుద్ధం జరుగుతోందని అన్నారు. వారి మాదిరిగా మీ బిడ్డకు ఎల్లో మీడియా లేవని, దత్తపుత్రుడు లేడని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేశారు.


‘‘ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు.. ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు. ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ బిడ్డ నమ్ముకున్నది.. దేవుడి దయ, మీ చల్లని దీవెనలు. తోడేళ్లంతా ఒక్కటవుతున్నాయి. ఈ అబద్ధాలను నమ్మకండి. వారి మాదిరిగా అబద్ధాలు చెప్పే అలవాటు మీ బిడ్డకు లేదు. మీ ఇంట్లో మంచి జరిగిందా లేదా అనేది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మంచి జరిగిందనుకుంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి.’’ అని అన్నారు.


వచ్చే సెప్టెంబరు నుంచి నా కాపురం విశాఖలోనే - జగన్


వచ్చే సెప్టెంబరు నెల నుంచి తన కుటుంబం విశాఖపట్నానికి తరలి వెళ్తున్నట్లుగా సీఎం జగన్ ప్రకటించారు. మూలపేట పోర్టు శంకుస్థాపన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా తాను తన కాపురాన్ని వచ్చే సెప్టెంబరు నుంచి విశాఖపట్నానికి తరలిస్తున్నట్లుగా చెప్పారు. శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు. సంతబొమ్మాళి మండలంలో మూలపేట పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు.


4 వేల కోట్లతో గ్రీన్ ఫీల్డ్ పోర్టు


Mulapeta Port Foundation Stone: సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్ల ఖర్చుతో మూలపేట పోర్టు పనులు చేపడుతున్నారు. 23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తులను నిర్మించనున్నారు. జనరల్‌ కార్గోకు, బొగ్గుకు, కంటైనర్‌తో పాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వాడుకొనేలా 30 నెలల్లో ఈ పోర్టును పూర్తిచేయాలని భావిస్తున్నారు. మూలపేట పోర్టు అందుబాటులోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు అత్యంత కీలకంగా మారనుంది. ఈ పోర్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25 వేల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 


ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్‌ నుంచి హిర మండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ఆఫ్‌ షోర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్ట్‌ పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ (YS Jagan Srikakulam Tour) శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్‌నాథ్‌, స్పీకర్‌ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.