విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు కోసం తాను రెండు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొదటిసారిగా తానే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశానని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం, ఆఖరికి స్టీల్ ప్లాంటు పోరాట సంఘాలు రాకపోయినా పోరాడానని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ కోసం మోదీ మోదీని, అమిత్ షాని, ఉక్కు శాఖ మంత్రిని పదీ పదిహేను సార్లు కలిశానని అన్నారు. ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయొద్దని కోరానని చెప్పారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ లేఖ రాశారని, ఆ లేఖలు కుక్కలైనా పట్టించుకుంటాయా అని ఎద్దేవా చేశారు. ‘‘పవన్ కల్యాణ్ నిరాహార దీక్ష చేశాడట. స్టీల్ ప్లాంట్ దగ్గర నేను టెన్త్, ఇంటర్ పరీక్షల కోసం నేను నిరాహార దీక్ష చేశాను. ప్రభుత్వం, చంద్రబాబు పట్టించుకున్నారా? కేసులకు భయపడి వారు ముందుకే రాలేదు’’ అని వ్యాఖ్యానించారు.


42 వేల కోట్లు డొనేషన్ ఇస్తానని రాతపూర్వకంగా నేను హామీ ఇచ్చాను. మోదీ, అమిత్ షాని, స్టీల్ మినిస్టర్ ని కలిసి ప్రైవేటీకరణ చేయొద్దని కోరా. రాష్ట్రంలో దొంగల మాటలకు మనకు వద్దు’’ అని అన్నారు. చంద్రబాబుకు 14 ఏళ్లు, కేసీఆర్‌కు 9 ఏళ్లు, జగన్‌కు ఐదేళ్లు అధికారం ఇచ్చారని, తనకు కూడా అధికారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. కుటుంబ, కుల పాలన మనకు వద్దని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల పాలన మనకు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. 


‘‘స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దాం. కంపెనీలు పెడదాం. రైతులకు రుణమాఫీలు చేద్దాం. స్టీల్ ప్లాంట్ ఆపగలిగిన నేను ఏవైనా చేయగలను అని నిరూపిస్తా. కామారెడ్డి రైతులకు కూడా న్యాయం చేశాను. ఎవరైనా ముందుకు వచ్చారా? నేనే హైకోర్టులో పైట్ చేశాను. సుప్రీంకోర్టులోనూ గెలిచా. కేసీఆర్‌పైన వేసిన ఆరు కేసుల్లో నేను గెలిచా. ఈ రాజకీయ నాయకులు మన కోసం లేరు. వాళ్ల స్వలాభం కోసమే ఉన్నారు’’ అని కేఏ పాల్ విమర్శించారు.


ఈ వీడియోని షేర్ చేయండి. ఈ నెంబర్ కి మీ డొనేషన్ ను పంపించండి. అమెరికా డబ్బు వాడకూడదు. నన్ను నమ్మిన ప్రతి ఒక్కరు పార్టీకి డొనేషన్ ఇవ్వండి. నేను వస్తేనే మార్పు వస్తుంది. డెవలప్‌మెంట్ జరుగుతుంది.’’ అని పిలుపు ఇచ్చారు.



ఇటీవల అంబేడ్కర్ విగ్రహంపై విమర్శలు


డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయం నెరవేరాలంటే విగ్రహాలు కాదు రాజ్యాధికారం కావాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రధానితో పోటీ పడి మరి 125 అడుగువు అంబేడ్కర్ విగ్రహం పెడుతున్నారని అన్నారు. ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి ఈ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్నారు. తాను అడిగే ప్రశ్నలకు జవాలు చెప్పలేకే తన హత్యకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిని కొనలేని వాళ్లు విశాఖను కొంటారా అని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో ఆంధ్రులను తిట్టి.. ఇప్పుడు ఏపీని పొగుడుతారా అని ప్రశ్నించారు. దేశం మరో శ్రీలంకగా మారుతోందని ధ్వజమెత్తారు. 2008లో 10 కోట్లు అడగడానికి కేసీఆర్ తన దగ్గరకు వచ్చారని కేఏ పాల్ అన్నారు. అలాగే ప్రస్తుతం ఆయన తనను చిత్రహింసలు పెట్టాలని చూస్తున్నారని.. ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్ధంగా ఉన్నాని చెప్పారు.