విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి...వేగంగా అడుగులు వేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీ లేదా 24న...సీఎం క్యాంప్ కార్యాలయాన్ని వైజాగ్ కు మారుస్తారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయ్. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నుంచే పాలన సాగనుండటంతో...విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ హోదా పెంచాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలుస్తోంది. ఇందులో భాగంగా నగర పోలీస్ కమిషనరేట్ పరిధిని అడిషనల్ డీ జీ ర్యాంక్ కు పెంచింది.  కొత్త నగర పోలీస్ కమిషనర్ గా 1994 బ్యాచ్ కు చెందిన రవిశంకర్ అయ్యన్నార్ ని నియమించింది. ఇప్పటి దాకా అక్కడ పని చేస్తున్న త్రివిక్రమ వర్మను బదిలీ చేసింది. 


1983 నుంచి విశాఖ పోలీస్ కమిషనరేట్ ను ఐజి స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారు. 1861 జనవరి 28న వైజాగ్...జిల్లా పోలీస్ వ్యవస్థ మొదలైంది. తొలుత వైజాగ్ నగరానికి ఎస్పీ స్థాయి అధికారి ఉండేవారు.  1948లో విశాఖను...ఉత్తరం, దక్షిణ భాగాలు విభజించారు.  1983లో పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసి విశాఖ అర్బన్ పరిధిని పెంచారు. జిల్లాల పునర్విభజన వరకు విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధి చాలా విస్తృతంగా ఉండేది. జిల్లాల పునర్విభజన తర్వాత విశాఖపట్నం జిల్లా మాత్రమే విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉంది. 20 లక్షల పైగా జనాభా కలిగిన విశాఖ అర్బన్ పోలీస్ కమిషనరేట్ పరిధిని...ఏడీజీ స్థాయికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ ను నగర పోలీస్ కమిషనర్ గా తాజాగా నియమించింది. ఆరు నెలల్లో ఆయన డీజీగా పదోన్నతి పొందనున్నారు. 


పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్‌ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామని సీఎం జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని సీఎం అన్నారు.  విశాఖ త్వరలో పరిపాలన రాజధాని కాబోతోందని...విశాఖ వేదికగా జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో వెల్లడించారు. తాను కూడా విశాఖ నుంచే పాలన చేయబోతున్నానని... త్వరలోనే ఇది సాకారం అవుతుందని ప్రకటించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయ‌మ‌ని చెబుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇకపై విశాఖ కేంద్రంగా పాల‌న ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. దీనికి త‌గ్గట్లుగానే సీఎం క్యాంపు కార్యాల‌యం కోసం విశాఖ‌లో ఇప్పటికే పోర్ట్ గెస్ట్ హౌస్‌ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి విశాఖకు షిఫ్ట్ కావాలని ప్రయత్నించినా...సీఎం కార్యాల‌యంతో పాటు ఆయ‌న‌కు అనుబంధంగా ఉండే జీఏడీ తరలింపులో ఆలస్యం అయింది. ఈ కారణంగా వచ్చే నెల నుంచి విశాఖ నుంచే పాలన సాగించాలన్న నిర్ణయానికి  సీఎం జగన్ వచ్చారని పార్టీలో టాక్ నడుస్తోంది.  


పోర్ట్ గెస్ట్‌హౌస్‌ను ముఖ్యమంత్రి తాత్కాలిక నివాసంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఏడాది చివరికల్లా రిషికొండలో సీఎం క్యాంపు కార్యాలయానికి సంబంధించిన పనులు పూర్తి చేసుకుని అందుబాటులోకి వస్తుందని ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటి వరకు పోర్ట్ గెస్ట్‌హౌస్ నుంచే పాలన చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతి సోమ, మంగళవారం విశాఖ‌లోనే సీఎం జగన్ అందుబాటులో ఉంటారని తెలుస్తోంది.