పశ్చిమగోదావరి జిల్లా నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గునుపూడి రాకముందే... వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. గునుపూడి వంతెన వద్ద వైసీపీ జెండాలు ఊపుతూ...రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అధికార పార్టీ కార్యకర్తలు. అనంతరం వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తలకు గాయాలయ్యాయి. పాదయాత్ర ఇందిరమ్మ కాలనీకి చేరుకోగానే వైసీపీ వర్గానికి చెందిన కొందరు వైసీపీ జిందాబాద్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టిడిపి వర్గీయులు జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. ఘటనలో ముగ్గురు పోలీసులతో పాటు స్థానిక ప్రజలకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారందర్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అల్లరిమూకలు రాళ్ల దాడి చేస్తున్నా పోలీసులు నిలువరించలేదని టీడీపీ నేతలు ఆరోపించారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే తమపై రాళ్లదాడి జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. లోకేశ్ కాన్వాయ్ లో పలు వాహనాలను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. అల్లరి మూకలు పాదయాత్ర జరిగే ప్రాంతంలోని భవనాలపైకి ఎక్కి...టీడీపీ కార్యకర్తలపై రాళ్లు రువ్వారు. దీంతో పలువురు యువగళం కార్యకర్తలకు గాయాలయ్యాయి. పాదయాత్రలో రాళ్ల దాడిపై లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేరు గ్రామంలో వైసీపీ దాడి, పోలీసుల తీరుకు నిరసనకు దిగారు. ఉన్నతాధికారులు వచ్చే వరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. వైసీపీ కార్యకర్తలు జెండాలు ఊపుతుంటే...పోలీసులకు రక్షణ కల్పించారని మండిపడ్డారు.