గురజాడ విశిష్ట పురస్కార ఈ సారి వివాదంగా మారింది. ఆధ్యాత్మిక ప్రవచన కర్త చాగంటి కోటీశ్వరరావుకి ఇవ్వటం ఏమిటని కొందరు రచయితలు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు అడ్డుకుంటామని రచయితలు, కళాకారుల సంఘాలు హెచ్చరిస్తున్నారు. ఎప్పుడూ ఘనంగా జరిగే అవార్డు ప్రధానం.. ఈసారి గందరగోళంగా మారింది.


దేశమంటే మట్టికాదోయ్… దేశమంటే మనుషులోయ్ అని గురజాడ రాతలు ప్రతి ఒక్కరిని కదిలించేవి. విజయనగరంలో గురజాడకు ప్రతిఏటా అనేక మంది ప్రముఖులకు విశిష్ట పురస్కార ప్రదానం చేస్తూ వస్తున్నారు గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు..  ఇందులో భాగంగా ఇప్పటివరకు జే వి సోమయాయులు, గొల్లపూడి మారుతి రావు, డా సి. నారాయణ రెడ్డి, కే. విశ్వనాద్, గుమ్మడి, షావుకారు జానకి, మల్లెమాల, అంజలి దేవి, సుద్దాల, యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తో పాటు పలువురు ప్రముఖులకు గురజాడ విశిష్ట పురస్కార అందుకున్న వారిలో ఉన్నారు. వీరందరూ రచయితలే. ఇందులో భాగంగానే ఈ ఏడాది ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర రావుకు గురజాడ విశిష్ట పురస్కారాన్ని ఇవ్వాలని  నిర్వహకులు నిర్ణయించుకున్నారు. ప్రధానం కోసం ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు నిర్వహకులు. చాగంటి కూడా అంగీకరించారు. 


ఈ నెల 30 న ఉదయం 10 నుండి రాత్రి 10 వరకు గురజాడ సాహితీ చైతన్యోత్సవంను గురజాడ గృహంలో పెద్ద ఎత్తున నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలోనే చాగంటికి గురజాడ విశిష్ట పురస్కార ప్రదానం చేయ్యాలని నిర్ణయించారు. పలువురు ప్రముఖులను కూడా ఆహ్వానించారు. ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. విమర్శలు మొదలయ్యాయి.


కవులు, రచయితలు, సాహితీవేత్తలు, జన విజ్ఞాన వేదిక సభ్యులు చాగంటికి గురజాడ విశిష్ట పురస్కార ప్రదానం ఎలా చేస్తారని వ్యతిరేకిస్తున్నారు. మహాకవి గురజాడ అభ్యుదయవాది, హేతువాది అయితే గురజాడ భావజాలానికి విరుద్దమైన భావాలు గల చాగంటి కి ఎలా ప్రధానం చేస్తారని  మండిపడుతున్నారు. గురజాడ గతాన్ని వదిలి ముందుకు పోదా పదండి పదండి అంటుంటారు. కానీ చాగంటి ప్రవచనాలు వేరుగా ఉంటాయి.  పొంతలేని చాగంటికి గురజాడ పురష్కారం ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. గురజాడ గౌరవ యాత్ర పేరిట కవులు, రచయితలు గురజాడ స్వగృహం నుంచి నిరసన ర్యాలీ చేపట్టాలన పిలిపునిచ్చారు.


గురజాడ విశిష్ట పురస్కార చాగంటికి ప్రకటించడం గురజాడ సాంస్కృతిక సమాఖ్య వ్యవహారంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇలాంటి వివాదాల నేపధ్యంలో చాగంటి కోటేశ్వరరావు తీసుకుంటారో లేదా అన్న అంశం ఆసక్తిగా మారింది.