Visakha Auto Prepaid Stand Tokens Issue: విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటో స్టాండ్ లో జారీ చేస్తున్న రశీదులపై ఏసు క్రీస్తు ఫొటో, బైబిల్ వాక్యాలు ఉండటం దుమారం రేపింది. విశాఖలో రశీదుల పేరుతో మత ప్రచారం జరుగుతోందని పోలీసు, ట్రాఫిక్ పోలీసులపై, ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వివాదంపై విశాఖ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ (ట్రాఫిక్ విభాగం) స్పందించారు. ఆటో డ్రైవర్ తీసుకువచ్చి ఇచ్చిన టోకెన్లలో ఏసుక్రీస్తు ఫొటో, బైబిల్ వాక్యాలు ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదన్నారు. డిపార్ట్ మెంట్‌కు ఇలా ప్రచారం చేయాలని ఎలాంటి ఉద్దేశం లేదని, ఎవరి మనోభావాలు దెబ్బతీయాలని చేసిన పని కాదన్నారు. ఈ నిర్లక్ష్య ఘటనపై బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. టోకెన్లు ఇచ్చిన ఆటో డ్రైవర్ శ్యాం క్షమాపణ కోరారు.
ఆ టోకెన్లు పొరపాటున ఇచ్చారు..
విశాఖ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ (ట్రాఫిక్ విభాగం) ఆటో స్టాండ్ రశీదులపై క్రీస్తు ఫొటో, బైబిల్ వాక్యాలు ఉండంపై ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ‘విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న ప్రీపెయిడ్ ఆటో స్టాండ్ వద్ద ప్రయాణికులకు వారు ప్రయాణించే ఆటో వివరాలతో కూడిన టోకెన్లు ఇస్తాం. ఆ టోకెన్లు అయిపోవడంతో అక్కడి పోలీస్ సిబ్బంది, రెగ్యూలర్ గా ఇచ్చే టోకెన్లు (Auto Prepaid Stand Tokens) తెమ్మని చెప్పగా, ఆ ప్రీపెయిడ్ ఆటో సెక్రటరీ శ్రీనివాసరావు @శ్యాం జీసస్ ఫొటో, బైబిల్ వాక్యాలతో ఉన్న టోకెన్లు తీసుకువచ్చి ఇచ్చారు. వాటిని గమనించకుండా డ్యూటీలో ఉన్న సిబ్బంది అదే సమయంలో తిరుమల ఎక్స్ ప్రెస్ ట్రైన్ ప్రయాణికులకు ఆ టోకెన్లు పొరపాటున ఇచ్చారు. అంతే తప్ప ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినది కాదని, ఆ పొరపాటున గ్రహించిన వెంటనే పోలీస్ సిబ్బంది ఆ టోకెన్ల ఇవ్వడాన్ని నిలిపివేశామని’ ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు.
డిపార్ట్ మెంట్‌కు అలాంటి ఉద్దేశం లేదు..
విశాఖ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ (ట్రాఫిక్ విభాగం) మీడియాతో మాట్లాడుతూ.. ‘శ్రీనివాస్ అనే ఆటో డ్రైవర్ కొన్ని టోకెన్లు తెచ్చి ఇచ్చారు. అందులో కింద ఏసుక్రీస్తు ఫొటో, బైబిల్ వాక్యాలు కొన్ని ఉన్నాయి. అయితే సిబ్బంది వాటిని గమనించుకోలేదు. అదే సమయంలో తిరుమలకు వెళ్తున్న ప్రయాణికులకు నాలుగు స్లిప్పులు ఇచ్చారు. అధికారులకు సమాచారం అందిన వెంటనే ఆ టోకెన్ల జారీని తక్షణమే నిలిపివేశాం. స్లిప్ జారీ చేసిన వారి వివరణ కూడా కోరతాం. దీనికి తమ డిపార్ట్ మెంట్‌కు ఏ సంబంధం లేదని పోలీసులు అన్నారు. తాము ప్రభుత్వ ఉద్యోగులమని, ఎవరూ ఇలాంటి చర్యలను ప్రోత్సహించరు. ఎవరి మనోభావాలను దెబ్బతీయడం కోసం ఇలా చేయలేదని, అనుకోకుండా జరిగిన తప్పిదం అన్నారు. సున్నితమైన అంశాల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటాం. అయితే ఈ వివాదాన్ని పెద్దది చేయవద్దని’ జరిగిన విషయాన్ని వెల్లడిస్తున్నట్లు చెప్పారు.