Ganja Smuggling in Alluri Seetharamaraju District: ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. సినీ ఫక్కీలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. పుష్ప సినిమా స్టైల్లో మాదకద్రవ్యాలను తరలిస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ వర్గాలను మస్కా కొట్టి గంజాయి సరిహద్దులు దాటించేస్తున్నారు. సినీ స్టైల్లో గంజాయి తరలిస్తున్న స్మగ్లర్ల ఐడియా.. తాజాగా, అధికారులకే మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. బోలెరో వాహనం టాప్ లో ప్రత్యేక అరను ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఈబీ పోలీసులు. డుంబ్రిగూడ మండలం కించుమండలో దగ్గర గంజాయి ముఠాను పట్టుకున్నారు ఎస్ఈబీ పోలీసులు. అనుమానాస్పదంగా వెళుతున్న బొలెరోను ఆపి తనిఖీలు చేశారు. ఈ క్రమంలో వాహనంలో ఉన్న వారిని ప్రశ్నిస్తుండగా.. ఎక్కడో చిన్న అనుమానం రావడంతో మళ్లీ వాహనాన్ని క్షుణంగా పరిశీలించారు.
బొలెరో వాహనంపై ప్రత్యేక అరను ఏర్పాటు చేసి అందులో గంజాయి చిన్న బస్తాలను ఉంచారు. ఈ క్రమంలో ఏదో కుక్కినట్టు కనిపించడంతో.. పోలీసులు మళ్లీ చెక్ చేసి.. గంజాయి బాక్సులను గుర్తించారు. సినిమా స్టైల్ లో స్మగ్లింగ్ కు పాల్పడటాన్ని చూసి అవాక్కయ్యారు. 130 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోరాపుట్ కు చెందిన పాంగి మహేశ్వర్, డుంబ్రిగూడకు చెందిన కిల్లో రమేష్ ను అరెస్ట్ చేశారు. వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి సీజ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఏపీలో రూ.9251 కోట్ల గంజాయి - మంత్రి తానేటి
ఏపీలో రూ.9251 కోట్ల విలువైన గంజాయిని ధ్వంసం చేశామని హోంమంత్రి తానేటి వనిత గత అక్టోబరు నెలలో వెల్లడించారు. అక్రమ మాదక ద్రవ్యాల నిరోధానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తానేటి స్పష్టం చేశారు. గంజాయి సాగుపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందన్నారు. ఆంద్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల్లో గంజాయిని పండించి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే విధానానికి అడ్డుకట్ట వేశామన్నారు. ఆపరేషన్ పరివర్తన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని హోంమంత్రి తెలిపారు. దాదాపు 311 ఏజెన్సీ గ్రామాల్లో గంజాయి సాగవుతున్నట్లు గుర్తించామన్నారు. ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా 9251 కోట్ల విలువ చేసే గంజాయిని నాశనం చేశామని గుర్తుచేశారు.
గంజాయిని నిలువరించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు. దేశంలోని 12 రాష్ట్రాల్లో గంజాయి సాగవుతుంటే ఏపీలోని 11,550 ఎకరాల గంజాయి అంటే దాదాపు 45 శాతం పంటను నాశనం చేసినట్లు తెలిపారు. ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న గంజాయి పౌడర్ ను పట్టుకుని ధ్వంసం చేసినట్లు హోంమంత్రి తెలిపారు. గంజాయి పంట సాగు చేయకుండా అవగాహన కార్యక్రమాలు, ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి ఏపీ ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. ఇప్పటి వరకు గంజాయి కేసుల్లో 11,100 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గంజాయి మత్తు పదార్ధాలపై యువతకు అవగాహన కార్యక్రమాల నిర్వహించినట్లు తానేటి వనిత పేర్కొన్నారు.