సత్యసాయి జిల్లాలో అర్ధరాత్రి అలజడి రేగింది. తెలుగుదేశం నాయకుడు గంటాపురం జగ్గుని పోలీసుల సమక్షంలోనే చితకబాదిన వైసీపీ నాయకులు చితకబాదారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు మూడు రోజుల క్రితం చంద్రబాబు, లోకేష్ లపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు కౌంటర్ గా తెలుగుదేశం నాయకుడు ఘంటాపురం జగ్గు మీడియా సమావేశం నిర్వహించారు. దీంతో ఎలాంటి నోటీసులు లేకుండా జగ్గుని పోలీసులు ఆర్దరాత్రి అదుపులోకి తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న కనగానపల్లి వైసీపీ కన్వీనర్ అమర్నాథ్ రెడ్డి తన అనుచరులతో చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకొని పోలీసుల సమక్షంలోనే విచక్షణారహితంగా దాడి చేశారు.
గంటాపురం జగ్గుకు చెందిన వాహనాన్ని సైతం ధ్వంసం చేసిన వైఎస్ఆర్ సీపీ నేతలు ధ్వంసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ధ్వంసమైన వాహనాన్ని పోలీసులు మరో ప్రాంతానికి తరలించారు. మొదట జగ్గు కోసం బత్తలపల్లి ధర్మవరం పోలీస్ స్టేషన్లలో వైఎస్ఆర్ సీపీ నాయకులు వెతికారు. చివరికి చెన్నే కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లి దాడి చేసినట్లుగా తెలిసింది. పోలీసుల ప్రేక్షక పాత్ర పై సర్వత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
చెన్నేకొత్తపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు
తాజా ఘటనల వేళ చెన్నేకొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గంటాపురం జగ్గు అక్రమ అరెస్టుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. రోడ్డుపై బైఠాయించి మాజీ మంత్రి పరిటాల సునీత పరిటాల శ్రీరామ్, సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఆందోళన చేస్తున్నారు. వీరికి మద్దతుగా టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
గంటాపురం జగ్గును విడుదల చేయాలని డిమాండ్ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేశారు. అర్ధరాత్రి అక్రమ అరెస్టులు చేసిన సీఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.
నెల్లూరులో టీడీపీ నేతపై కారుతో దాడి
నెల్లూరు జిల్లాలోనూ కాస్త ఇలాంటి ఘటనే జరిగింది. నెల్లూరు సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్, నుడా మాజీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై ఆయన కుమారుడి స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి దాడి చేశాడు. ఉద్దేశపూర్వకంగా కారుని రివర్స్ లో స్పీడ్ గా డ్రైవ్ చేసి కోటంరెడ్డి కాలుకి గాయం చేశాడు. మద్యం మత్తులో అతను ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు చెబుతున్నారు వైద్యులు. ఆయన్ను స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కోటంరెడ్డి ఇంటి వద్దే ఘటన..
కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి కుమారుడికి నాగవెంకట రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు. ఈరోజు రాత్రి కోటంరెడ్డి ఇంటికి వచ్చిన రాజశేఖర్ రెడ్డి, ఆయన కుమారుడితో గొడవ పడ్డాడు. ఆ గొడవ పెద్దదిగా మారడంతో కోటంరెడ్డి జోక్యం చేసుకున్నారు. ఆయన రాజశేఖర్ రెడ్డిని మందలించారు. దీంతో అతడు తాగిన మైకంలో కోపంతో కారుని కోటంరెడ్డిపైకి పోనిచ్చాడు. కోటంరెడ్డి కాలుకి గాయమైంది. అతడిని ఆస్పత్రిలో చేర్పించారు.
నాయకుల పరామర్శ....
నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చేరిన కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని స్థానిక టీడీపీ నాయకులు పరామర్శించారు. నెల్లూరు డ్రగ్స్ కి అడ్డాగా మారిందని, గుట్కాలనుంచి, సింగిల్ నెంబర్ లాటరీల వరకు అన్నీ వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్. వైసీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకీ పెచ్చుమీరిపోతున్నాయని, అధికార పార్టీ అండ చూసుకునే తమపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.