Vizianagaram Latest News:విజయనగరం టిడిపి ఎంపీ అప్పలనాయుడు ఏం చేసినా సంచలమే. పార్లమెంట్‌కి సైకిల్‌పై వెళ్లినా ఎంపీగా తొలి జీతాన్ని అమరావతి నిర్మాణానికి ఇచ్చేసినా కలిశెట్టి అప్పలనాయుడు పంథానే వేరు. తాజాగా మరొక ప్రకటన చేసి సంచలనం సృష్టించారు అప్పలనాయుడు. ఈ మధ్య జరిగిన మహిళా దినోత్సవం సందర్భంగా తన నియోజకవర్గం విజయనగరంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలకూ కొత్త తాయిలం ప్రకటించేశారు. అదేంటంటే విజయనగరం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఏ దంపతులు మూడో బిడ్డను కంటే వాళ్లకు బహుమతి ఇస్తానని చెప్పారు.
మూడో సంతానానికి బహుమతి
మూడో సంతానంగా ఆడపిల్ల పుడితే 50వేల రూపాయలు వెంటనే డిపాజిట్ చేస్తానని చెప్పుకొచ్చారు. మూడో సంతానంగా మగబిడ్డ పుడితే అవు,దూడను గిఫ్టుగా తల్లిదండ్రులకు ఇస్తానని ప్రకటించారు ఎంపీ అప్పలనాయుడు. లోక్‌సభ సభ్యుడిగా తన గౌరవ వేతనం 2 లక్షలపైన వస్తుందని దానిలో నుంచి ఈ కానుకలు చెల్లిస్తానని ఎంపీ తెలిపారు.
ఎంపీ జీతం నుంచి ఖర్చు చేస్తానన్న ఎంపీ
ఇచ్చిన డబ్బులు సరిపోవని భావిస్తే తన సొంత డబ్బులో నుంచి ఈ కానుకలు అందజేస్తానని ప్రకటించారాయన. ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు మేరకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తన తల్లి భార్యతో చర్చించాక ఈ కానుకలు ప్రకటిస్తున్నానని వెల్లడించారు. ఇది ఒకట్రెండింటితో ఆగిపోదని ఎంపీ హామీ ఇచ్చారు. నిరంతరం కొనసాగే ప్రక్రియ అని భరోసారి ఇచ్చారు.
కలెక్టర్ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి
దంపతులకు మూడు బిడ్డ పుట్టినట్టు కలెక్టర్ నుంచి ధృవీకరణ పత్రం తెచ్చుకోవాలని అప్పలనాయుడు అన్నారు. ప్రస్తుతం విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఎంపీ స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. వైరల్ అవుతోంది.
అధిక సంతానాన్ని కనాలన్న చంద్రబాబు
దేశంలో అధిక సంతానాన్ని కనాలని ప్రధాని మోదీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరూ పిలుపునిస్తున్నారు. ప్రస్తుతానికి యువత జనాభా అధికంగానే ఉన్నా వారు పెళ్లి పిల్లలపై దృష్టి పెట్టడం లేదు. దీంతో భవిష్యత్తులో యువత జనాభా తగ్గిపోయే ప్రమాదం ఉందని కేంద్రం చెబుతోంది. జనాభా నియంత్రణ వల్ల డీ లిమిటేషన్‌లో దక్షిణాది రాష్ట్రాలు ఎంపీ సీట్లను కోల్పోతున్నాయని స్టాలిన్ లాంటి వాళ్లు ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.
చంద్రబాబు ప్రచారానికి ఊపు తీసుకొచ్చిన ఎంపీ
కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలకి మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ఇచ్చిన పిలుపుని విజయనగరం ఎంపీ కాస్త సీరియస్‌గానే తీసుకున్నారు. దానితో మూడో బిడ్డను కంటే కన్నతల్లులకు ఈ కానుకలు ప్రకటించేసారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇదో టాపిక్ గా మారిపోయింది.