Srikakulam Latest News: శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుడుమూరి నాగరాజు సంచలన కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో తాను కోడెల ఫ్యామిలీపై తప్పుడు కేసులు పెట్టానని అంగీకరించారు. ఆ ఫ్యామిలీతోపాటు టీడీపీ శ్రేణులు తనను క్షమించాలని వేడుకున్నారు. 


పోలాకి మండలం యవ్వారపేటకు చెందిన బుడుమూరి నాగరాజు గతంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడు శివరామకృష్ణపై కేసులు పెట్టారు. లంచం అడిగారని నరసరావుపేటలో కేసు పెట్టారు. ఇప్పుడు ఆ కేసు వాయిదాకు వచ్చిన నాగరాజు మీడియాతో మాట్లాడాడు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకునేందుకు చూస్తున్నట్టు చెప్పారు. కేవలం నాయకుల ఒత్తిడితోనే తాను ఈ కేసు పెట్టినట్టు అంగీకరించాడు. 


క్రికెట్ జీవితానికి ఇబ్బంది అవుతుందని భయపడి గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేశానని నాగరాజు అన్నాడు. వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తనపై ఒత్తిడి చేసినట్టు ఆరోపించాడు. వాళ్ల ప్రోత్బలంతోనే కోడెల ఫ్యామిలీపై తప్పుడు కేసులు పెట్టినట్టు చెప్పుకొచ్చాడు. కేవలం వారు చెప్పినట్టుగానే 15 లక్షల లంచం ఇచ్చినట్లు తప్పుడు కేసు పెట్టానని తెలిపాడు. 


Also Read: ప్రాణాలు నిలిపేందుకు లక్షలు ఖర్చు పెట్టి జూ ఎన్టీఆర్ - కోలుకున్నాక విషాదం- తిరుపతి కౌశిక్ హఠాన్మరణం !


ప్రభుత్వం మారడంతో భయం లేకుండా నిజం చెబుతున్నాని నాగరాజు వివరణ ఇచ్చాడు. పోలీసులతో మాట్లాడి ఈ కేసును లోక్‌అదాలత్‌లో పరిష్కరించుకునే మార్గాలను వెతుకుతున్నట్టు వివరించాడు. 
నరసరావుపేట వచ్చి చూస్తే జరిగిన అభివృద్ధి, అందుకే కోడెల శివప్రసాదరావు పడ్డ శ్రమ కనిపిస్తుందని నాగరాజు అభిప్రాయపడ్డాడు. కోడెల కుటుంబంపై ఇచ్చిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు. తప్పుడు కేసు పెట్టినందుకు కోడెల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు క్షమించాలని వేడుకున్నాడు.


డిసెంబర్‌లో నాగరాజుపై కేసు నమోదు అయింది. ఇతను చంద్రబాబు పీఏ పేరు చెప్పుకొని దందాలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. క్రికెటర్లకు స్పాన్సర్స్‌గా ఉండాలని, కొందరిని బెదిరించినట్టు కూడా ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా కూడా చంద్రబాబు పీఏగా పని చేసిన పెండ్యాల శ్రీనివాస్ పేరు చెప్పుకొని చేసినట్టు తెలిసింది. దీంతో పెండ్యాల శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాగరాజుపై కేసు నమోదు చేశారు. నాగరాజు  ఆంధ్రా టీం తరఫున రంజీల్లో ఆడాడు.  ఇతనిపై ఇలాంటి మోసాలకు పాల్పడినందుకు చాలా కేసులు నమోదు అయ్యాయి. 


ఇప్పుడు సడెన్‌గా కోడెల ఫ్యామిలీపై పెట్టిన కేసులు ఉపసంహరించుకుంటానంటూ, టీడీపీ కార్యకర్తలు క్షమించాలని చెప్పడం కూడా డ్రామా అని నాగరాజు గురించి తెలిసిన వాళ్లు అంటున్నారు. ఇలా చేసి నమ్మించడంలో అతను దిట్ట అంటూ విమర్శిస్తున్నారు. 


Also Read: కర్ణాటకకు బెంగుళూరు, తెలంగాణకు హైదరాబాద్ ఏపీకి చంద్రబాబు అడ్వాంటేజ్ - మీడియా కాంక్లేవ్‌లో లోకేష్