BRS MLC Kavitha : మహిళలను విలన్‌లుగా చిత్రీకరించే ఓటీటీ, సీరియల్స్ కంటెంట్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నింటిపై స్పందించే మహిళలు దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఒకప్పుడు ఊరి చివర అశ్లీలమైన పోస్టర్ ఉంటేనే మహిళా సంఘాలు వాటిని చించి ధర్నాలు చేసేవి అని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ అశ్లీలత ఇంట్లోకే వచ్చినా స్పందించకపోవడానికి కారణమేంటో ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. 

అసభ్యకర కంటెంట్‌పై ఆగ్రహం 

హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ  మహిళా నేతలు, మహిళా కార్యకర్తలు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. అసలు దానికి కారణాలు గుర్తించాలని అన్నారు. ఒకప్పుడు అశ్లీలంగా ఉండే వాల్‌ పోస్టర్లను మహిళా సంఘాలు చించివేసేవని గుర్తు చేశారు. ఆ సినిమాలకు వ్యతిరేకంగా ధర్నాలు చేసేవాని తెలిపారు. అలా ఎందుకు చేస్తున్నారో అప్పట్లో తనకు అర్థమయ్యేది కాదని కానీ తర్వాత అర్థమైందని వివరించారు. 

ఏం చూస్తే అలానే పెరుగుతారు

పదేళ్లుగా తాను యాక్టివ్ రాజకీయాల్లో ఉంటున్నానని కానీ అశ్లీలతపై ఎవరూ రియాక్ట్ కావడం లేదని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో పెరిగే అబ్బాయిలు వారు రోజూ చూసే కంటెంట్‌ను బట్టే అవతలి వాళ్లపై అభిప్రాయన్ని బిల్డ్ చేసుకుంటారని అన్నారు. అలాంటి వాళ్లకు మనం నిత్యం అశ్లీల కంటెంట్ చూపిస్తే వాళ్ల మైండ్‌లో అదే తిరుగుతూ ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా నేరలకు ఇదే కారణమని అన్నారు. 

ఏ సీరియల్ చూసిన అత్తా కోడళ్లే విలన్లు

ఒకప్పుడు వీధి చివర గోడపైనే అశ్లీలత కనిపించేది అని ఇప్పుడు మన నట్టింటిలోకే వచ్చిందని కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా, ఓటీటీ కంటెంట్ రూపంలో అభ్యంతరకరమైన కెంటంట్‌ పెరిగిపోతోందని అన్నారు. దీనికి తోడు రోజూ వచ్చే సీరియల్స్‌లో కూడా మహిళలను విలన్లుగా చూపిస్తున్నారని వారిపైనే అసభ్యకరమైన జోక్స్ వేయిస్తున్నారని అన్నారు. అత్తపై కోడలి కుట్ర, కోడలిని చంపేందుకు అత్త ఎత్తులు ఏ సీరియల్ చూసినా ఇదే ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. 

Also Read: అప్పుడు మొఘల్ పాలకులు, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు గుడులు కూల్చుతున్నారు: ఈటెల రాజేందర్

ఆడవాళ్లను కించపరిచేలా తక్కువ చేసి చూపించే ఉన్న కంటెంట్‌పై గళమెత్తాల్సిన అవసరం ఉందని కవిత అభిప్రాయపడ్డారు. మహిళలు అంటే ఎంటర్‌టైన్మెంట్ బొమ్మలు కాదు అమ్మలు అని మన పిల్లలకు చెపేలా ఉండాలని కవిత సూచించారు. ఇలాంటి విషయాలపై ధైర్యంగా ముందుకు వచ్చి పోరాటం చేయాలని సూచించారు. 

మహిళా రిజర్వేషన్‌ త్వరగా అమలు చేయాలి

మరోవైపు మహిళా రిజర్వేషన్ కోసం కూడా కొట్లాడాల్సిన సమయం వచ్చిందన్నారు కవిత. దీన్ని సభలో ఆమోదించిన కేంద్రం జనగణనతో ముడి పెట్టి అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఈ రిజర్వేషన్ అమలు కానందు వల్ల మహిళలు చాలా మంది నష్టపోతున్నారని వాపోయారు. ఈ ప్రక్రియను కేంద్రం త్వరగా పూర్తి చేసి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి అమలు చేయాలని డిమాండ్ చేశారు. 

2500 ఎప్పుడు ఇస్తారు?

కేంద్రంలో మోదీ ప్రభుత్వం పని తీరు అలా ఉంటే రాష్ట్రంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశార. ఒక్కో మహిళకు 2500 ఇస్తామని చెప్పిన కాంగ్రెస్... ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. చేసిన వాగ్ధానాలు అమలు చేయకపోగా ఇప్పుడు బస్‌లను కిరాయి ఇచ్చేలా ప్రోత్సహిస్తున్నాని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు ఆ బస్‌లకు ఇచ్చే కిరాయిని సకాలంలో ఇవ్వగలరా అని ప్రశ్నించారు. నిర్థిమైన ప్రణాళిక లేకుండా మహిళలను కోటీశ్వరులను చేస్తామని గప్పాలు ఎందుకు కొట్టుకుంటున్నారని నిలదీశారు.  

Also Read: అఖిల పక్ష సమావేశానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ గైర్హాజరుపై ప్రభుత్వం రియాక్షన్ ఇదే