MP Vijayasai Reddy Comments: గత కొంత కాలంగా మరుగున పడిన మూడు రాజధానుల అంశాన్ని మళ్ళీ  తెరమీదకు తెచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఆంధ్ర ప్రదేశ్ కు పాలనా రాజధాని వైజాగ్ మాత్రమే అని తేల్చేశారు. ఎవరు అవునన్నా.. కాదన్నా దీనిలో ఏ మాత్రం మార్పు లేదంటున్నారు ఆయన. ఏపీకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ కాకుండా అడ్డుకునే శక్తి చంద్రబాబుకే కాదు మరెవరికీ లేదన్నారు విజయ సాయి. 



మూడు రాజధానులు -సీఎం జగన్ మానస పుత్రిక :

ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్తలోనే  17 డిసెంబర్ 2019 న ఏపీ అసెంబ్లీ లో సీఎం జగన్ స్వయంగా ఈ మూడు రాజధానుల ప్రస్తావనను తీసుకొచ్చారు . ఏపీలో రాజధానిగా అమరావతి పూర్తి చెయ్యాలి అంటే కనీసం లక్ష కోట్లు కావాలని అదే కొద్దిపాటి పెట్టుబడితో ఇప్పటికే డెవలప్ అయిన వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ రాజధాని గా ,కర్నూల్ లో  హైకోర్టు పెట్టడం ద్వారా  న్యాయ రాజధానిగా.. ఇక ఇప్పటికే అసెంబ్లీ నిర్మాణం పూర్తి అయిన అమరావతిని శాసన రాజధానిగా మారుస్తామని సీఎం జగన్ చేసిన ప్రకటనతో రాష్ట్రంలో  సంచలనం రేగింది . మిగిలిన ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా ఏపీ రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల నుండి భారీ ఎత్తున నిరసన రేగింది. ఈ ప్రకటన వచ్చిన తెల్లారి నుండే అమరావతి పరిసర గ్రామాల్లోని రైతులు, ప్రజలు ఒక జేఏసీ గా ఏర్పడి రోడ్డెక్కారు . పోలీస్ అరెస్టులు ,ధర్నాలతో అమరావతి ప్రాంతం దద్దరిల్లింది . సీఎంగా జగన్ మూడేళ్లు పరిపాలన పూర్తి చేసుకుంటే అందులో రెండున్నరేళ్లు ఈ అమరావతి రైతుల, మహిళల ధర్నాలతోనే నడిచిపోయింది.

 

కోర్టు కేసులతో యూ -టర్న్

మూడు రాజధానుల నిర్ణయం పై విపక్షాల తోపాటు ,అమరావతి ప్రాంత రైతుల నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పాటు, కోర్టు కేసులు కూడా ప్రభుత్వానికి ఎదురయ్యాయి. ఈ మూడు రాజధానుల బిల్లులో గల లోపాలపై ఏపీ హై కోర్టు నుండి అనేక ప్రశ్నలు ఎదురవుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ ఆ బిల్లును 22 నవంబర్ 2021 న వెనక్కు తీసేసుకుంది. ఇదే బిల్లును సమగ్రంగా మళ్లీ తీసుకు వస్తామని సీఎం జగన్ తోపాటు మంత్రి పెద్దిరెడ్డి లాంటివాళ్లు కూడా చెప్పుకొచ్చారు.

 

కొంతకాలంగా మూడు రాజధానుల బిల్లుపై నిశ్శబ్దం

అయితే ఏమైందో  ఏమో కానీ .. మూడు రాజధానుల అంశంపై మంత్రులు గానీ , సీఎం గానీ కొంతకాలంగా  మౌనం పాటిస్తున్నారు. విశాఖ అభివృద్ధి గురించి పదే పదే చెబుతున్నారు. సీఎం కూడా అనేక సార్లు వైజాగ్ పర్యటనలు చేస్తున్నారు కానీ వైజాగ్ కు పరిపాలన రాజధాని  మార్పు పై మాత్రం ఎలాంటి ప్రకటన చెయ్యడం లేదు.  సీఎం జగన్  ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలి అని కేడర్ కు చెబుతున్నారు తప్ప మూడు రాజధానుల అంశం మాత్రం పక్కన పెట్టేస్తున్నారు . దానికి తగ్గట్టే మంత్రులు కూడా విశాఖ కు రాజధాని మార్పు అంశంపై నోరు మెదపడం లేదు. ఇటీవల తమ సామాజిక న్యాయ భేరి పేరుతో చేపట్టిన బస్సు యాత్ర విశాఖలో పర్యటించినా సరే రాజధాని అంశంపై మాత్రం స్పష్టమైన ప్రకటన ఏదీ చెయ్యనేలేదు. దానితో మూడు రాజధానుల కథ ఇక ముగిసిపోయింది అని అంతా అనుకున్నారు. 

 

మళ్ళీ తేనె తుట్టెను కదిపిన విజయసాయిరెడ్డి

 

అయితే, సడెన్ గా విజయ సాయి రెడ్డి వైజాగ్ ను ఏపీకి పరిపాలనా రాజధానిగా చేసి తీరుతాం అంటూ చేసిన ప్రకటన రాజకీయంగా చర్చను రేపుతోంది. సీఎం జగన్ కు తెలియకుండా ఇంత పెద్ద ప్రకటన విజయసాయిరెడ్డి చేసే అవకాశం లేదు కాబట్టి ఇది ప్రభుత్వం మళ్ళీ మూడు రాజధానుల అంశంపై ముందుకే పోవాలని చూస్తుంది అనడానికి ఈ కామెంట్లే రుజువు అంటున్నారు పరిణామాలు గమనిస్తున్న వారు.