నిన్నమొన్నటి వరకూ విపక్షాల మధ్య పొత్తులపై అనేక ఊహాగానాలు నడిచాయి. ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జోరు మీదున్న జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఏర్పడడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే ఆ పొత్తు స్వరూపం ఎలా ఉంటుందనే అంశంపై అనేక ఊహాగానాలు నడిచాయి. ప్రస్తుతం ఈ అంశం చల్లబడింది. పొత్తుల మాట పక్కనబెట్టి అన్ని పార్టీలూ సొంతంగా బలపడే పనిలో పడ్డాయి. దీనితో దమ్ముంటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలన్న వైసీపీ సవాల్‌ను విపక్షాలు స్వీకరించాయా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. ఒకవేళ అదే నిజం అయితే జగన్ ట్రాప్‌లో విపక్షాలు పడ్డట్టే అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి .
పవన్ కల్యాణ్ కేంద్రంగా ఏపీలో పొత్తుల రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత రాజకీయాల్లో ముఖ్యమైన అంశంగా జనసేన మారింది అనడంలో అనుమానం లేదు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైందా పార్టీ. అధ్యక్షుడే ఓడిపోయిన పరిస్థితి నుంచి మూడేళ్ళలోనే జనసేన కీలక పాత్ర పోషించేలా ఎదిగింది అంటున్నారు విశ్లేషకులు. దానితో ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో పవన్ కల్యాణ్ పాత్ర ప్రముఖంగా మారింది. ముందుగా 2024 ఎన్నికల గురించి .. పొత్తుల గురించీ ప్రస్తావన తెచ్చింది పవనే కావడం ఇక్కడ మరో కీ పాయింట్. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని ఆయన ఇచ్చిన పిలుపు ఏపీలో సంచలనంగా మారింది.
పవన్ చేసిన ఆ కామెంట్ ఏపీలో విపక్షాల మధ్య పొత్తు ఖాయమనే చర్చ మొదలైంది. ఇప్పటికే బీజేపీతో భేషరతు పొత్తులో ఉన్న జనసేన టీడీపీతోనూ జంట కట్టడం ఖాయమనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది. అయితే ఏమైందో ఏమో గానీ సడన్‌గా మాట మార్చారు. పార్టీలతో కాదు... ప్రజలతోనే పొత్తు ఉంటుంది అంటూ మళ్ళీ వార్తల్లో నిలిచారు.
సొంతంగా బలపడే ప్రయత్నాల్లో టీడీపీ
మహానాడు సక్సెస్ ఇచ్చిన ఊపులో టీడీపీ నూతన ఉత్సాహంతో కనపడుతుంది. ఇటీవల చంద్రబాబు పెడుతున్న సభలకు, ర్యాలీలకు జనం పోటెత్తుతున్నారు. దానితో పొత్తులపై దృష్టి కంటే జనంలో వస్తున్న స్పందనను ఓట్లగా మార్చుకోవడమే మంచిది అనే అభిప్రాయంలో టీడీపీ అధినాయకత్వం పడింది అంటున్నాయి పార్టీ వర్గాలు. నిజానికి జనసేనతో పొత్తు విషయమై స్పందించింది టీడీపీనే. తమది వన్ సైడ్ లవ్ అంటూ ప్రకటించి సంచలనం రేపారు చంద్రబాబు. భీమ్లా నాయక్ రిలీజ్ సమయంలో జనసేనతో సమానంగా.. పవన్‌కు మద్దతుగా నిలిచింది టీడీపీ శ్రేణులే అన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే ప్రస్తుత పరిణామాల్లో పొత్తు విషయమై మౌనం పాటిస్తున్నారు చంద్రబాబు. అలాగే పొత్తుల విషయం ప్రస్తుతానికి పక్కనబెట్టి వివిధ నియోజకవర్గాలకు అభ్యర్థులను సెలెక్ట్ చేసే పనిలో పడ్డారు.
పొత్తుల వ్యవహారంలో అసలుపాత్ర బీజేపీదే
ఇక ఏపీలో పొత్తుల వ్యవహారంలో కీలక పాత్ర బీజేపీనే పోషిస్తుంది. టీడీపీ -జనసేన -బీజేపీ పొత్తు ఏర్పడాలని జనసేన భావించినప్పటికీ.. టీడీపీ తో పొత్తు విషయంలో బీజేపీ అంత సుముఖంగా లేదన్న వాదనలు ఉన్నాయి. అలాగే టీడీపీ కూడా బీజేపీతో కంటే జనసేనతో పొత్తునే ఆశించింది. ఇక ప్రస్తుత పరిణామాల్లో ఇవి జరిగే పని కాకపోవడంతో ఎవరి పార్టీ వ్యవహారాల్లో వారు మునిగిపోయారు. ఇక బీజేపీ -జనసేన పొత్తు కూడా ఏ మలుపులు తిరుగుతుందో చెప్పలేం అంటున్నారు విశ్లేషకులు.
జగన్ స్ట్రాటజీనే అసలు కారణం ?
అవునన్నా .. కాదన్నా ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్లకు ఎంతో కొంత వ్యతిరేకత సహజం. ఇటీవల గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులకూ, ఎమ్మెల్యే లకూ ఎదురైన సంఘటనలే దీనికి ఉదాహరణ అనే వాదన ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేది లేదంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రకటనా .. టీడీపీ మహానాడు విజయవంతం కావడం లాంటి అంశాలతో సీఎం జగన్ అలెర్ట్ అయ్యారు. దానితో వారి మధ్య పొత్తు ఆపడానికి వైసీపీ నేతలతో పదేపదే విపక్షాలకు దమ్ముంటే ఒంటరిగా పోటీ చెయ్యాలంటూ సవాల్ విసిరేలా వ్యూహం పన్నారని వాదనలు వినవస్తున్నాయి. మరి ఆ స్ట్రాటజీ పని చేసిందో ఏమోగానీ.. విపక్షాలు ప్రస్తుతం పొత్తు మాట ఎత్తడం లేదు. దీనితో జగన్ ట్రాప్‌లో అపోజిషన్ పార్టీలు పడ్డాయి అంటున్నారు. మరి దీనిపై విపక్షాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.