Vizag to Bangalore Akasa Air Flight: విశాఖ నుంచి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు మరో క్రొత్త విమానం అందుబాటులోనికి వచ్చింది. కొత్తగా ప్రారంభించిన " ఆకాశ " ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం ఇకపై విశాఖ నుంచి ఎగరనుంది. దీనిని ఏపీ ఐటీశాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఆరు విమానాశ్రయాలు ఉండగా వాటిలో మరిన్ని నూతన సర్వీసులు నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా పలు ఎయిర్ లైన్స్ సంస్థలకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆకాశ ఎయిర్ లైన్స్ కు విశాఖ, బెంగళూరు మధ్య నడపనున్న తొలి సర్వీసును విశాఖ విమానాశ్రయంలో ప్రారంభించారు. 
అనంతరం మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నూతన సర్వీసు విశాఖ నుంచి నేరుగా బెంగళూరుకు, బెంగళూరు నుంచి విశాఖకు రాకపోకలు సాగిస్తుందన్నారు. ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులకు మరిన్ని విమానాలు అదనoగా నడపడం వల్ల ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు మరింత సులభంగా రాకపోకలు సాగించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు విశాఖ నుంచి నూతన సర్వీసులు నడపాలని ఆ సంస్థ ప్రతినిధులను మంత్రి కోరారు. హైదరాబాద్, ఢిల్లీ, గోవా నగరాలకు నూతన సర్వీసులు నడపాలని మంత్రి అమర్నాథ్ ఆకాశ ఎయిర్ లైన్స్ యాజమాన్యాన్ని కోరారు. ప్రస్తుతం ఆకాశ సంస్థ 9 ప్రధాన నగరాల్లో తన సర్వీసులను నడుపుతోందని విశాఖ నుంచి తన పదో సర్వీసును ప్రారంభించడం ఆనందకరంగా ఉందని అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖలో త్వరలో గ్లోబల్ సమ్మిట్ జరగనుందని, అలాగే జీ 20 సమావేశాలకు సంబంధించి కూడా విశాఖ వేదిక కానుందని భావిస్తూ మరిన్ని విమాన సర్వీసులు అవసరం ఉందన్నారు.
హైదరాబాద్, గోవా, లక్నోలకూ విస్తరించనున్న "ఆకాశ " విమాన సర్వీసులు:
ఆకాశ సంస్థ ప్రతినిధులు ప్రవీణ్ ఐయ్యర్, ఆకుల అరవింద్, సాగర్ నాయక్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు విశాఖతో కలుపుకొని 10 నగరాల్లో తమ సంస్థ సేవలు ప్రారంభించినట్లు చెప్పారు, త్వరలో హైదరాబాద్, లక్నో, గోవాలో తమ సంస్థ సేవలు ప్రారంభమవుతాయి అన్నారు. ప్రతిరోజు 58 సర్వీసులు దేశంలో పలు నగరాలకు నడుపుతున్నామన్నారు.


ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు మాట్లాడుతూ.. విశాఖ విమానాశ్రయం నుంచి ఆకాశ సంస్థ తన సేవలు ప్రారంభించడము అభినందనీయమన్నారు. వారికి అవసరమైన సహకారం పూర్తిస్థాయిలో అందిస్తామన్నారు. త్వరలోనే మరిన్ని సర్వీసులు విశాఖ నుంచి నడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే ఇక్కడ నుంచి ప్రయాణించే ప్రయాణికులు సంఖ్య పెరుగుతుందన్నారు.
విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం సలహా మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గతంలో దుబాయ్ కు విశాఖ నుంచి నేరుగా ఎయిర్ ఇండియా విమానం ఉండేదని అది ప్రయాణికులకు అత్యంత సౌకర్యంగా ఉండేదన్నారు. తిరిగి దుబాయ్ విమానాన్ని పునరుద్ధరించాలని, అంతేకాకుండా ముఖ్య నగరాలకు విమాన సర్వీసులు పెరిగితే ఆయా ప్రాంత ప్రజలకు మేలు కలుగుతుంది అన్నారు. ఇతర నగరాలకు వెళ్లాలంటే వేర్వేరు విమానాశ్రయాలకు వెళ్లి అక్కడ నుంచి వెళ్లాల్సి వస్తుందని ఇది భారముగా మారుతుందన్నారు. ప్రయాణీకులకు ఇబ్బందులూ తప్పడము లేదన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కరణం రెడ్డి నర్సింగరావు, ఏపీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు విజయ మోహన్, విమాన యాన సిబ్బంది పాల్గొన్నారు. ఆకాశ ఎయిర్ లైన్స్ లో విశాఖపట్నం నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికురాలికి మంత్రి అమర్నాథ్ తొలి టికెట్ అందజేశారు.