YSRCP BC Meetings: ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలకు బీసీల నుంచి విశేష ఆదరణ వస్తోందని టీడీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్ధా వెంకన్న అన్నారు. అందుకే ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇప్పుడు బీసీలు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో బీసీలకు ఆదరణ దక్కలేదని, సీఎం జగన్ పాలనలో తన సామాజిక వర్గానికి చెందిన నేతలు సామంత రాజులుగా చెలామణి అవుతున్నారని, బీసీలు మీకు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.
జగన్ కొంగ జపం చేసినా బీసీలు వైసీపీ వెంట రారు అని, పెద్ది రెడ్డి, కొడాలి నాని చేసిన పనికి ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు హయాంలో చేపట్టిన కార్యక్రమాలతో జయహో బిసి అనే పేరునే మీరు కాపీ కొట్టారని, ఇటీవల విజయవాడలో జరిగిన బీసీ గర్జనకు బిసిలు రాలేదని, వచ్చిన వాళ్లు గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు అని బుద్ధా వెంకన్న చెప్పారు. వైసీపీ నేతలు ఉత్తరాంధ్రలో ఉన్న బీసీ నాయకత్వాన్ని దెబ్బకొడుతున్నారని, ప్రజల దృష్టిమళ్లించడానికి రెండు రాష్ట్రాలు కలిస్తే బావుండునని, జరగని పని గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో 1994 ఎన్నికలు రిపీట్ అవుతాయి. 34 కి 34 సీట్లు టీడీపీ కైవసం చేసుకుంటుందన్నారు. ఏపీకి రావాల్సిన అమర్ రాజా బ్యాటరీ కూడా పక్క రాష్ట్రానికి వెళ్లిపోయిందని ప్రస్తావించారు.
జగన్ పాలనలో బిసిలకు ఆదరణ ఏది..
చంద్రబాబు పాలనలో బీసీలను ఆదరించారని, ప్రతి సామాజిక వర్గానికి అండగా నిలిచామన్నారు. వైసీపీ పాలనలో జగన్ రాజు అయితే, మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు సామంతరాజులుగా ఉన్నారని బీసీలకు పెద్దదిక్కు ఎవరంటే సీఎం సామాజిక వర్గం పేరు చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. గత మూడున్నరేళ్లు జగన్ బీసీలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అరాచకాలు, బీసీలపై చేసిన అరాచకలను ఖండించని వ్యక్తి సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు రోడ్ షోలకు బీసీలు వస్తున్నారని, ఇప్పుడు జగన్ బీసీల జపం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
చంద్రబాబుపై అవాక్కులు చవాక్కులు పేలే పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి అనంతపురంలో ఆయన కూర్చుని ప్రెస్ మీట్ పెడితే.. మంత్రి, మేయర్ కూర్చుంటే మిగతా వాళ్లు (బీసీలు) 40 నిమిషాల పాటు నిల్చున్నారని గుర్తుచేశారు. మాజీ మంత్రి కోడాలి నాని, పెద్దిరెడ్డి చేసిన పనులకు ఏపీ ప్రభుత్వం బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలను కాపీ కొట్టి జయహో బీసీ సభలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్ధా వెంకన్న. బీసీ మీటింగ్ పెడితే హాజరైంది మాత్రం వాలంటీర్లు అని ఆరోపించారు. బీసీలు ఎవరూ బీసీ గర్జనకు, వైసీపీ నిర్వహించిన బీసీ కార్యక్రమానికి హాజరు కాలేదన్నారు. అందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్, వైసీపీ పాలనే కారణమన్నారు.