బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మాండస్‌ గత అర్ధరాత్రి పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తీరం దాటినట్లుగా వాతావరణ అధికారులు తెలిపారు. ఇది శుక్రవారం ఉదయానికే తీవ్ర తుపాను నుంచి తుపానుగా బలహీనపడినట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. క్రమంగా ఇది వాయవ్య దిశగా పయనించి శనివారం (డిసెంబరు 10) ఉదయానికి మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారనున్నట్లు తెలిపారు. 


తుపాన్ ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పలుచోట్ల పది మీటర్ల నుంచి 20 మీటర్ల దూరం మేర సముద్రం ముందుకు వచ్చింది. ఏపీలో వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. చలిగాలులు ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టించాయి. తీరం వెంట 65 నుంచి 75 కిలో మీటర్ల వేగంతో వేగంతో గాలులు వీస్తుండగా.. కోస్తా, రాయలసీమ కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలో 125.75, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 114 మి.మీ వర్షపాతం నమోదైంది.


‘‘తిరుపతి జిల్లాలోని పలు భాగాల్లో విపరీతమైన వర్షాలు వర్షాలు కురుస్తున్నాయి. గాలులు గంటకు 70 కిలో మీటర్ల వేగంతో వీచాయి. అలాగే నెల్లూరు, పక్కనే ఉన్న అన్నమయ్య జిల్లాల్లో వర్షాలుంటాయి. చిత్తూరు జిల్లాలో కూడా వర్షాలు జోరందుకోనున్నాయి. తుపాను నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాలతో పాటుగా విశాఖ నగరంలో కూడా తెలికపాటి వర్షాలు పడ్డాయి. తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడ్డాయి. అలాగే ఈ వర్షాలు మెల్లగా తిరుపతి జిల్లా వ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఈ తుపాను మామూలు విధ్వంసకరాన్ని తేవడంలేదు.


అర్ధరాత్రి సమయంలో మాండోస్ తుపాను చెన్నైకి సమీపాన తీరాన్ని తాకడం ప్రారంభించింది. ఇక్కడ నుంచి అసలైన తుపాను ప్రభావం మన రాష్ట్రం మీదుగా పడనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలి. తిరుపతి జిల్లాలో విస్తారంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా తిరుపతి జిల్లా నాయుడూపేటలో 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. తిరుపతి నగరంలో వర్షాల జోరు గంట గంటకు పెరుగుతోంది, ఇంకా పెరగనుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ రాశారు.


ఈ జిల్లాల్లో వర్షాలు భారీ వర్షాలు


‘‘తుపాను ప్రభావంతో ఈ రోజు (డిసెంబరు 10) ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో  అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపు చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. తుపాను తీరం దాటినప్పటికి రేపటి వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’’ అని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.


తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తుపాను ప్రభావం తెలంగాణపై చాలా స్వల్పంగా ఉంది. తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్‌లో వాతావరణం ముసురు పట్టి ఉంటుంది. నగరంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 16 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. తూర్పు దిశ నుంచి గాలులు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు.