RK Beach in Visakhapatnam: మహా శివరాత్రి పర్వదినాన భక్తులు చేసిన జాగరణ ఉదయం ముగిసింది. దాంతో విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌కు భక్తులు పోటెత్తారు. విశాఖ చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం వేల సంఖ్యలో భక్తులు ఉదయమే బీచ్ వద్దకు చేరుకుని సముద్ర స్నాన్నాలు చేశారు. వరుసగా 37వ సంవత్సరం కూడా ఇక్కడ భారీ శివలింగాన్ని ఏర్పాటు చేయడంతో రాత్రి నుండి రామకృష్ణ బీచ్ లో అభిషేకాలు జరిగాయి. 


ఆర్కే బీచ్‌కు పోటెత్తుతున్న భక్తులు
శివరాత్రి సందర్భంగా శివ జాగరణ చేసిన భక్తులు ఉదయమే సూర్య నమస్కారాలు చేస్తూ.. ఇసుకలో ఏర్పాటు చేసుకున్న సైకత లింగాల వద్ద పూజా సామాగ్రిని ఉంచి సముద్ర స్నానాలు ఆచరించారు. ఓ పక్క మిలాన్ 2022 ఆంక్షలు ఉన్నా భక్తులు భారీ సంఖ్యలో వైజాగ్ బీచ్‌కు చేరుకుంటున్నారు. సాధారణ సమయంలోనే ఆర్కే బీచ్‌కు స్థానికులు వచ్చి సేదతీరుతుంటారు. శివరాత్రి జాగరణ చేసిన భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు వేకువజాము నుంచే ఆర్కే బీచ్‌కు క్యూ కడుతున్నారు.


శివనామస్మరణతో మార్మోగిన విశాఖ శారదాపీఠం 
విశాఖ శ్రీ శారదాపీఠం శివ నామస్మరణతో మార్మోగింది. మహాశివరాత్రి వేడుకలు బుధవారం(నేటి) తెల్లవారుజాము వరకు కొనసాగాయి. భక్తులంతా శివనామ స్మరణతో పీఠం ప్రాంగణాన్ని హోరెత్తించారు. దీప కాంతులతో రూపొందించిన జ్యోతిర్లింగార్చన శివరాత్రి వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శివ స్వరూపుడు, ఆది గురువు అయిన మేధా దక్షిణామూర్తికి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి. మహన్యాస పూర్వకంగా సాగిన ఈ అభిషేకంలో పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములు 11 రకాల ద్రవ్యాలను వినియోగించారు. లింగోద్భవ కాలం దాటే వరకు దాదాపు మూడున్నర గంటల పాటు ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పరమేశ్వరునికి జ్యోతిర్లింగార్చన చేపట్టారు. 
జ్యోతిర్లింగార్చనకు పీఠాధిపతులు హారతులిచ్చి పూజలు చేశారు. ఆతర్వాత చంద్రమౌళీశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేసారు. అనంతరం తాండవ మూర్తి సన్నిధిలో రుద్రహోమం, మృత్యుంజయ హోమం నిర్వహించారు. బ్రహ్మి ముహుర్తంలో హోమాలకు పూర్ణాహుతి చేసారు. మహాశివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్ష చేపట్టిన భక్తులకు పీఠాధిపతులు స్వయంగా ప్రసాదాన్ని పంపిణీ చేసి, శివతత్వాన్ని బోధించారు. శివరాత్రి సందర్బంగా జాగరణ చేసే భక్తుల సౌకర్యార్థం తెల్లవారుజాము వరకు పీఠ ప్రాంగణంలోని దేవతామూర్తుల ఆలయాలను తెరిచే ఉంచారు. విశాఖ శ్రీ శారదాపీఠం నిర్వహించిన మహాశివరాత్రి వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.


Also Read: Weather Updates: దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో వాతావరణం ఇలా


Also Read: Gold-Silver Price: శుభవార్త! నేడు దిగొచ్చిన బంగారం ధర, పెరిగిన వెండి - నేటి ధరలు ఇవీ