Donald Trump News | విశాఖపట్నం: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘనవిజయం సాధించింది. డోనాల్డ్ ట్రంప్ రెండో పర్యాయం అమెరికా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ మిల్లెట్స్ ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్ చిత్రపటాన్ని తయారు చేశారు.


హోరాహోరీగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ పై విజయం సాధించి రెండో పర్యాయం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలను ఉపయోగించి ఎంతో సహజసిద్ధంగా డొనాల్డ్ ట్రంప్ చిత్రాన్ని విజయ్ కుమార్ తయారు చేశారు. విక్టరీ సాధించేశాం అని ట్రంప్ చూపుతున్నట్టుగా.. వెనుక భాగంలో అమెరికా జాతీయ జెండాను సైతం తీర్చిదిద్దడం విశేషం. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్, అమెరికా మధ్య విదేశీ సంబంధాలు మరింత బలోపేతం కావాలని విజయ్ కుమార్ ఆకాంక్షించారు.


డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. నాలుగేళ్ల పాటు అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగనున్నారు. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ సీట్లు ఉండగా 270 వచ్చిన వారు విజయం సాధిస్తారు. నేడు జరిగిన ఓట్ల లెక్కింపులో రిపబ్లికన్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటేయడంతో ట్రంప్ అధ్యక్షుడిగా విజయం సాధించారు.



డొనాల్డ్ ట్రంప్‌నకు 277, కమలా హారిస్‌కు 224 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. కౌంటింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యంలో కొనసాగారు. 


ట్రంప్‌ కు మద్దతుగా ఓటేసిన రాష్ట్రాలు - వాటికి ఉన్న ఎలక్టోరల్ ఓట్లు 


టెక్సాస్‌ 40, ఫ్లోరిడా 30, పెన్సిల్వేనియా 19, ఒహియో 17, జార్జియా 16, నార్త్‌ కరోలినా 16, ఇండియానా 11, విస్కాన్సిన్‌ 10, అలబామా 9, సౌత్‌ కరోలినా 9, మిస్సోరి 10, టెన్నెసీ 11, కెంటకీ 8, లూసియానా 8,  ఆర్కాన్సాస్‌ 6, అయోవా 6, ఐడహో 4, కాన్సస్‌ 6, మైన్‌ 1,  మిసిసిపి 6, మోంటానా 4, నార్త్‌ డకోటా 3, నెబ్రాస్కా 4,  ఓక్లహోమా 7, సౌత్‌ డకోటా 3, యుటా 6, వెస్ట్‌ వర్జీనియా 4,వయోమింగ్‌  3.


కమలా హ్యారిస్‌కు  మద్దతుగా ఓటేసిన రాష్ట్రాలు - వాటికి ఉన్న ఎలక్టోరల్ ఓట్లు 


కాలిఫోర్నియా 54, న్యూయార్క్‌ 28, న్యూజెర్సీ 14, వాషింగ్టన్‌ 12 కొలరాడో 10, మిన్నెసోటా 10, మేరీల్యాండ్‌ 10, ఓరెగాన్‌ 8,  కనెక్టికట్‌ 7, డీసీ 3, డెలవేర్‌ 3, హవాయి 4, ఇల్లినోయీ 19, మసాచుసెట్స్‌ 11,న్యూహ్యాంప్‌షైర్‌ 4, న్యూమెక్సికో 5, రోడ్‌ ఐల్యాండ్‌ 4, వర్జినియా 13, వెర్మాంట్‌ 3, మైన్‌ 1, నెబ్రస్కా 1. 


Also Read: White House Facts: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా ?