Vizag News: రుషికొండ బీచ్ లో అడుగు పెట్టాలంటే ప్రవేశ రుసుము చెల్లించాల్సిందేనని వైసీపీ ప్రభుత్వం అంటోంది. ఈ క్రమంలోనే ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ బీచ్ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేలా నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి గత నెలలోనే టెండర్లు ఆహ్వానించారు. గడువులోగా ఎవరూ స్పందించకపోవడంతో రెండోసారి టెండర్ పిలిచింది. ఈనెల ఏడవ తేదీన దీనికి సంబధించి ప్రీబిడ్ సమావేశం జరిగింది. ఈనెల 18వ తేదీన టెండర్ తెరవనున్నారు. పర్యాటకులను ఆకట్టుకునేలా తీరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఆకట్టుకునే స్థాయిలో బీచ్ లో ప్రమాణాలు పాటించాలి. ఏపీటీడీసీ దీని నిర్వహణ చేపట్టడంతో విఫలం అవుతోంది.
ఖర్చు తగ్గించుకునే మార్గంతో ఆదాయం వస్తుందని..
అయితే ఏటా లక్షల రూపాయలు ఇందు కోసం వెచ్చించాల్సి వస్తోంది. అయినప్పటికీ తగిన ప్రణామాలు పాటించలేకపోతుందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రైవేటుకు అప్పగించడం ద్వారా ఖర్చు తగ్గించుకునే మార్గంతో పాటు ఏపీటీడీసీకు కొంత ఆదాయం వస్తుందని అప్పగించేస్తున్నారు. దీంతో ఇక్కడి బీచ్ కు వచ్చే పర్యాటకుల మీద భారం పడబోతుంది. సాధారణ రోజుల్లో వేల సందర్శకులు పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. వారాంతాలు, ప్రత్యేక రోజుల్లో మరింత మంది ఎక్కవుతుంటారు. త్వరలోనే ప్రవేశ రుసుం మొదలుకొని పార్కింగ్, బీచ్ లో సౌకర్యాలు, సేవలను వినియోగించుకున్నందుకు సందర్శకుల నుంచి టిక్కెట్ల రూపంలో వివిధ రకాల రుసుముల్ని ప్రైవేటు సంస్థ ద్వారా వసూలు చేయనున్నారు. ప్రస్తుతం కేవలం పార్కింగ్ రుసుము మాత్రమే వసూలు చేస్తున్నారు.
వసతుల కల్పనతోపాటు నిర్వహణ..
భారత దేశ బ్లూ ఫ్లాగ్ బీచ్స్ మిషన్ నుంచి రుషికొండ బీచ్ కు ఎకో లేబుల్ ‘బ్లూ ఫ్లాగ్’ వచ్చింది. దీంతో ఈ బీచ్‌కు ఇప్పుడు గ్లోబల్ టూరిజం మ్యాప్‌లో స్థానం లభించింది. ఈ ప్రాజెక్ట్ కోసం 2017లో రుషికొండ బీచ్ నామినేట్ చేయబడగా, 2018 ఫిబ్రవరిలో ఖరారు చేయబడింది. అవుట్డోర్ ఫిట్నెస్ పరికరాలు, నిరంతరం బీచ్ శుభ్రపరిచే యంత్రాలు, సిసిటివి కెమెరాలు, లైఫ్ గార్డ్లు వంటి భద్రతా పరికరాలు ఈ ప్రాజెక్టులో భాగంగా అందించబడ్డాయి. అయితే బ్లూఫ్లాగ్ బీచ్ లో మౌలిక వసతుల కల్పనతో పాటు మొత్తం నిర్వహణ, తీరంలో సురక్షిత విధానాల పాటింపు, పహారా సేవలు అందించాలి. లైఫ్ గార్డులు, మూత్ర శాలల, మరుగు దొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, సౌర విద్యుత్తు, తాగునీటి నిర్వహణ చేపట్టాలి. వ్యర్థాల నిర్వహణ, ఎల్ఈడీ విద్యుత్తు దీపాలు, నడక దారులు, సీసీ టీవీ కెమెరాలు నిర్వహించాలి.
నీట క్రీడలన్నీ అందుబాటులో..
రుషికొండ బీచ్ ఈత కొట్టడం, వాటర్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్ వంటి ఆటలు ఆడుకోవడానికి అనువైన ప్రదేశం. అదనంగా, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఈ బీచ్ చుట్టూ కుటీరాలు, రెస్టారెంట్లు, ఇతర సౌకర్యాలతో పాటు ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశంగా మార్చింది. అంతేకాకుండా డైవింగ్, సముద్ర కయాకింగ్, పారామోటరింగ్, స్పీడ్ బోటింగ్, జెట్ స్కీ, వంటి ఎన్నో వినోదాత్మకమైన ఆటలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. బీచ్ నీటిలో పర్యాటకులు నీటి క్రీడలను ఆస్వాదించవచ్చు.