Rains in Telangana AP: వాయుగుండం పుదుచ్చేరి - చెన్నై మధ్యలో తీరాన్ని తాకడంతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని నేడు సైతం కొన్ని జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి, విద్యా సంస్థలకు సెలవుదినంగా ప్రకటించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం బలపడిందని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు. నైరుతి బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను ఆనుకొని ఏర్పడిన అల్పపీడనం ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఇది క్రమంగా వాయువ్య దిశగా పయనించి తీరం దాటింది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడులో మరో రెండు రోజులు పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ నేడు, రేపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో నేడు సైతం వాతావరణం పొడిగా మారిపోయింది. రాష్ట్రంలో మరో రెండు నుంచి మూడు రోజులు వాతావరణంలో ఏ మార్పులు ఉండవని అధికారులు తెలిపారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో నవంబర్ 16న మరో అల్పపీడనం ఏర్పడనుంది. భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్ స్థానికులను హెచ్చరించారు. మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, సహాయం కావాల్సిన వారు 9110564575, 08625-295015, 9849905894 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, పాత భవనాల్లో నివసిస్తున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచించారు.
తెలంగాణలో వాతావరణం ఇలా (Telangana Weather Updates)
తెలంగాణలో వాతావరణంలో ఏ మార్పులు లేవు. రాష్ట్రంలో వాతావరణం పొడిగా మారింది. మరో మూడు రోజులవరకు ఇలాగే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రానికి ఎలాంటి వర్ష సూచన లేదు. వర్షాలు లేకపోవడంతో తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు చలికాలంలోనూ దిగి రావడం లేదు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత ఖమ్మంలో 33.4 డిగ్రీలు నమోదు కాగా, మెదక్ లో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా రాత్రిపూట 14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులపాటు తెలంగాణకు ఏ వర్ష సూచన లేదని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలతో ఉంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడే అవకాశం ఉంది, గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 18 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఈశాన్య దిశ నుంచి గాలులు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు. జిల్లాలతో పోల్చితే హైదరాబాద్‌లో చలి సాధారణంగా ఉంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో..
వాయుగుండం తీరాన్ని దాటినా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో దాని ప్రభావం లేదు. ఈ జిల్లాల్లో వాతావరణం పొడిగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయుగుండం తీరాన్ని తాకడంతో ఉత్తర కోస్తాంధ్రలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని భావించినా అలా జరగలేదు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వాతావరణం పొడిగా మారుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గాలులు వీచడంతో చలి తీవ్రత పెరుగుతోంది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు..
నేడు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనుండగా, ఇతర ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలున్నాయి. ప్రకాశం, పల్నాడు, ఎన్.టీ.ఆర్, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల వర్షాలున్నాయి. నెల్లూరులో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయి. రాయలసీమలోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, అనంతపురం జిల్లాల్లో నేడు మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. తిరుపతి జిల్లా గూడూరు - శ్రీకాళహస్తి వైపుగా భారీ వర్షాలున్నాయి. కావలి - సింగారాయకొండలో నిన్న 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.