ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకుంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ శామ్ కరన్ మూడు వికెట్ల ప్రదర్శనతో పాకిస్తాన్‌ను 20 ఓవర్లలో 137/8కి పరిమితం చేశారు. అనంతరం బెన్ స్టోక్స్ అజేయ అర్ధ సెంచరీతో ఇంగ్లండ్‌ను విజేతగా నిలబెడ్డాడు. కరన బంతితో తన అద్భుత ప్రదర్శనకు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్', అలాగే 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా ఎంపికయ్యాడు.


టోర్నమెంట్‌లో టాప్ 5 పరుగుల స్కోరర్లు:


విరాట్ కోహ్లీ: సెమీఫైనల్‌లో భారత్ నిష్క్రమించినప్పటికీ స్టార్ ఇండియా బ్యాటర్ టోర్నమెంట్‌ను అత్యధిక పరుగుల స్కోరర్‌గా ముగించాడు. అతను ఆరు మ్యాచ్‌లలో 296 పరుగులు చేశాడు. 98.66 సగటుతో మూడు అర్ధ సెంచరీలు కొట్టాడు.


మాక్స్ ఓ'డౌడ్: నెదర్లాండ్స్‌కు చెందిన మాక్స్ ఓ'డౌడ్ క్వాలిఫయర్‌లతో సహా ఎనిమిది మ్యాచ్‌ల్లో 242 పరుగులు చేసి టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఇందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. సగటు 34 కంటే ఎక్కువగా ఉండటం విశేషం.


సూర్యకుమార్ యాదవ్: టోర్నమెంట్ సమయంలో భారత బ్యాటర్ విశ్వరూపం చూపించాడు. తన స్ట్రైక్ రేట్ ఏకంగా 189.6గా ఉంది. మూడు అర్ధ సెంచరీలు కూడా కొట్టాడు. అతను ఆరు మ్యాచ్‌లలో 239 పరుగులు చేశాడు. సగటు 60 కంటే తక్కువ ఉంది.


జోస్ బట్లర్: ఇంగ్లండ్ కెప్టెన్ సెమీఫైనల్‌లో చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు . అతను రెండు అర్థ సెంచరీలతో 225 పరుగులు చేసి టోర్నమెంట్‌ను ముగించాడు.


కుశాల్ మెండిస్: శ్రీలంక వికెట్ కీపర్-బ్యాటర్‌కు ఇది అద్భుతమైన టోర్నమెంట్‌. అతని జట్టు నాకౌట్ దశకు చేరుకోవడంలో విఫలమైనప్పటికీ, మెండిస్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 223 పరుగులు చేశాడు.


టోర్నీలో టాప్ 5 వికెట్లు తీసిన ఆటగాళ్లు:


వనిందు హసరంగ: ఈ శ్రీలంక లెగ్ స్పిన్నర్ సూపర్ 12, క్వాలిఫైయర్‌లు మాత్రమే ఆడినా కూడా ప్రధాన వికెట్ టేకర్‌గా టోర్నమెంట్‌ను ముగించాడు. ఎనిమిది మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు.


శామ్ కరన్: ఈ ఇంగ్లండ్ ఆల్ రౌండర్ 13 వికెట్లతో టోర్నమెంట్‌ను ముగించాడు. అతను ఫైనల్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.


బాస్ డి లీడే: నెదర్లాండ్స్ గ్రూప్ దశకు చేరుకోవడంలో ఈ పేసర్ కీలక పాత్ర పోషించాడు. డి లీడే ఎనిమిది మ్యాచ్‌ల్లో 13 వికెట్లు పడగొట్టాడు.


బ్లెస్సింగ్ ముజారబానీ: ఈ జింబాబ్వే పేసర్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. తన పేస్ మరియు బౌన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు.


అన్రిచ్ నోర్ట్జే: కేవలం ఐదు గేమ్స్‌లోనే అతను 11 వికెట్లు తీశాడు.