విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్స్ వద్ద ముఖ్యమంత్రి జగన్ ను విమర్శిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపాయి. రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి స్వాగతం అంటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జన జాగరణ సమితి పేరుతో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేపు ఐటి హిల్స్ లో అదాని డేటా సెంటర్ కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.


విశాఖపట్నం రుషికొండలో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటికి వెళ్లే దారిలో ‘రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రి కి స్వాగతం- సుస్వాగతం’ అంటూ ఫ్లెక్సీలు కట్టి జన జాగరణ సమితి వినూత్న నిరసన తెలిపింది. ఈ సందర్భంగా జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దేశ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతారని అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అంతటి గొప్ప రికార్డు సృష్టించిన జగన్ కు ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా సన్మానం చేసి "క్యాపిటల్ లెస్ సీఎం" బిరుదు ఇవ్వాలని కోరారు. 


ఎన్నికలకు ఏడాది ముందు మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్ పోర్టు, అదాని డేటా సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రుల చెవిలో పూలు పెట్టాలని చూస్తున్నారని, ఇక్కడ ప్రజలు ఎవరు కూడా జగన్ ను నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. అంతేకాకుండా 29 వేల మంది అమరావతి రైతు కుటుంబాల కాపురాలను రోడ్డున పడేసి ముఖ్యమంత్రి జగన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి మాత్రమే విశాఖపట్నంలో కాపురం పెడతానని ప్రకటించారని ఉత్తరాంధ్రవాసులు చర్చించుకుంటున్నారని అన్నారు. 


ముఖ్యమంత్రి జగన్ పై స్వామి భక్తి నిరూపించుకోవడానికి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రసాద్ రెడ్డి ప్రజాస్వామ్యబద్దంగా నిరసన వ్యక్తం చేసిన జన జాగరణ సమితి నాయకుల పైన అక్రమ కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురిచేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ డైవర్షన్ పాలిటిక్స్ కు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర వాసులను జాగృతం చేయడానికి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వెనకడుగు వేయబోమని జన జాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు హెచ్చరించారు.