2.73% DA hike to AP Government Employees: అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు DA మంజూరు చేసింది సర్కార్. ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 జనవరి 1 నుంచి ఇవ్వాల్సిన DA ను మంజూరు చేస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులకు DA జీవో 66 ద్వారా, పెన్షనర్లకు జీవో 67 ద్వారా 2.73% మంజూరు చేసింది ఏపీ ప్రభుత్వం. జూన్ నుంచి సవరించిన వేతనాలను ఉద్యోగులు అందుకోనున్నారు. ఈ కొత్త DA ను జూలై 1, 2023 నుంచి జూన్ జీతంతో కలిపి ఇచ్చేవిధంగా  ఏర్పాటు చేశారు.


జనవరి 2022 నుంచి జూన్ 2023 వరకు ఇవ్వాల్సిన DA బకాయిలను సెప్టెంబర్, డిసెంబర్, మార్చి నెలల్లో 3  సమాన వాయిదాలలో  చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త DA తో కలిపి ఉద్యోగుల మొత్తం DA 22.75 శాతానికి చేరుకుంది. డీఏ మంజూరు చేసిన  ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.


తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యోగుల పోరాటం.. 
తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఉద్యమానికి రెడీ అవుతోంది. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క అంశం మీద నిర్దిష్టమైన పరిష్కారం ప్రభుత్వం చూపించలేదని సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. మే 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి తమ ఆందోళనకు సంబంధించిన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం  అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. మే 22 న కార్యచరణ ప్రారంభమై అక్టోబరు 31 వరకు వివిధ దశల్లో ఆందోళన చేపడతాం.. అక్టోబరు 31 న ఛలో విజయవాడకు పిలుపునిచ్చి నిరవధిక సమ్మెను చేపడతాం అని హెచ్చరించారు. 
రాజమండ్రిలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సర్వ సభ్య సమావేశం జరిగింది. సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కారరావుతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు భారీ ఎత్తున తరలివచ్చారు. అనంతరం ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ..
సీపీఎస్ రద్దు చేస్తాం, రెగ్యులరైజ్ చేస్తాం అని చెప్పి ఏవీ నెరవేర్చలేదన్నారు. గత ముఖ్యమంత్రి రెండు డీఏ లు పెండింగ్ లో పెట్టేశారు.. మేము వస్తే, గౌరవప్రదమైన పీఆర్సీ ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీలు ఇచ్చారు. తామే ఇచ్చినటువంటి హామీలను సీఎం జగన్ నెరవేర్చడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు న్యాయంగా, హక్కుగా రావాల్సిన సుమారు 20 వేల కోట్లు పై చిలుకు బకాయి పెట్టారు. ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అనే నిర్దిష్టమైన షెడ్యూల్ చెప్పమంటే కూడా ప్రకటించడం లేదన్నారు.


మే 5వ తేదీన సీఎస్ కు తమ ఆందోళనకు సంబంధించి నోటీసు జారీ చేస్తామన్నారు. మే 22న తాలూకా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలలో నిరసన కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు సూర్యనారాయణ. జూన్ నెలలో బీఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాల వద్ద విజ్ఞాపన పత్రాలు ఇస్తామని తెలిపారు. ఆపై జులై 5, 6 తేదీలలో నంద్యాల, కర్నూలు జిల్లాల మొదలుపెట్టి అక్టోబరు నెలాఖరకు అన్ని జిల్లా కేంద్రాల్లో బహిరంగ ప్రదర్శనలు చేపడతామని ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు. రాష్ట్ర ప్రభుత్వం
చర్చల పేరుమీదనే ఉద్యోగులను తోలు బొమ్మలాట లాగా నాలుగు స్తంభాలాట ఆడిస్తున్నారంటూ మండిపడ్డారు.