Watch Video: 


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023లో ఓ వివాదం చెలరేగింది. అంపైరింగ్‌ ప్రమాణాలు, సంజూ శాంసన్‌ నిబద్ధతపై కొందరు నెటిజన్లు ట్రోలింగ్‌ మొదలు పెట్టారు. రోహిత్‌ శర్మ బౌల్ట్‌ అయినప్పడు సంజూ శాంసన్‌ గ్లోవ్స్‌ తాకడం వల్లే బెయిల్స్‌ లేచాయంటూ విమర్శించడం మొదలు పెట్టారు. తాజాగా రిప్లేలు, వీడియోలను పరిశీలిస్తే అతడి తప్పేమీ లేదని తేలింది.


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు 2023లో అంపైరింగ్‌ వివాదాలు తక్కువే! వైడ్‌, నోబాల్‌ రివ్యూ తీసుకొనే అవకాశాలు ఉండటంతో ఫ్రాంచైజీలు పెద్దగా ఆందోళన చెందడం లేదు. అనుమానం వస్తే వెంటనే సమీక్ష కోరుతున్నాయి. ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) మ్యాచులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఔటైనప్పుడు రివ్యూ సైతం తీసుకోకపోవడం గమనార్హం. ఇంతకీ ఏం జరిగిందంటే?




ఆదివారం వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ (MI vs RR) తలపడ్డాయి. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగు చరిత్రలో ఇది 1000వ మ్యాచ్‌. అందులోనూ నిన్న రోహిత్ శర్మ 36వ పుట్టిన రోజు. అతడు భారీ స్కోరు చేయాలని చాలామంది అభిమానులు కోరుకున్నారు. 213 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయికి శుభారంభం దక్కలేదు. సందీప్ శర్మ వేసిన 1.6వ బంతికి హిట్‌మ్యాన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.


సందీప్‌ శర్మ (Sandeep Sharma) వేసిన నకుల్‌ బాల్‌ను ఆడేందుకు రోహిత్‌ శర్మ లేటుగా స్పందించాడు. నెమ్మదిగా వచ్చిన బంతి అతడిని దాటేసి ఆఫ్‌ స్టంప్‌ను తాకేసింది. అదే సమయంలో సంజూ శాంసన్‌ గ్లోవ్స్‌ వికెట్లను తాకినట్టు కనిపించింది. దాంతో వివాదం మొదలైంది. సంజూ నైతికత పాటించలేదన్నట్టుగా కొందరు ట్వీట్లు చేశారు. అంపైర్‌ కనీసం రివ్యూ తీసుకోలేదని, ఇవేం అంపైరింగ్‌ ప్రమాణాలంటూ మరికొందరు వాదించేశారు.




ఈ విమర్శలకు సంజూ శాంసన్ అభిమానులు గట్టిగానే స్పందించారు. సైడ్‌ యాంగిల్‌ కెమేరాలో రోహిట్‌ ఔటైన వీడియోలను వైరల్‌ చేశారు. అందులో వికెట్లకు సంజూ శాంసన్‌కు మధ్య చాలా దూరం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. వివాదం సద్దుమణిగింది.


Mumbai Indians vs Rajasthan Royals: ఐపీఎల్‌ చరిత్రలో 1000వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ముంబై ఇండియన్స్ 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు. చివరి ఓవర్లో 17 పరుగులు చేయాల్సిన దశలో టిమ్ డేవిడ్ (45 నాటౌట్: 19 బంతుల్లో, రెండు ఫోర్లు, ఐదు సిక్సర్లు) వరుసగా మూడు సిక్సర్లతో చెలరేగాడు.


ముంబై ఇండియన్స్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ (55: 29 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక రాజస్తాన్ బ్యాటర్ల విషయానికి వస్తే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124: 62 బంతుల్లో, 16 ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు) సూపర్ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో పూర్తిగా యశస్వి జైస్వాల్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. యశస్వి జైస్వాల్ తప్ప మరే ఇతర రాజస్తాన్ బ్యాటర్ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయాడు.