Kedar Jadhav joins RCB:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ అనూహ్య నిర్ణయం తీసుకుంది! టీమ్‌ఇండియా వెటరన్ క్రికెటర్ కేదార్ జాదవ్‌ను జట్టులోకి తీసుకుంది. గాయపడిన డేవిడ్ విలే ప్లేస్‌లో అతడితో ఒప్పందం కుదుర్చుకుంది. అంటే మిగిలిన సీజన్లో జాదవ్‌ను చూడబోతున్నాం అన్నమాట!
ఇండియన్ ప్రీమియర్ లీగులో కేదార్ జాదవ్‌కు అంత మంచి రికార్డేమీ లేదు. ఇప్పటి వరకు 93 మ్యాచులు ఆడాడు. 83 ఇన్నింగ్సుల్లో 1196 పరుగులు చేశాడు. 22.15 సగటు, 123.17 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 101 బౌండరీలు, 40 సిక్సర్లు బాదేశాడు. ఆరు సార్లు డకౌట్ అయ్యాడు. క్రీజులో నిలిస్తే పరుగులు చేయగలడు. విచిత్రమైన విషయం ఏంటంటే వికెట్ కీపర్‌గా 14 క్యాచులు అందుకొని ఏడుగురిని స్టంపౌట్ చేశాడు. మూడు వికెట్లు తీసిన విలే గాయపడటంతో అతడితో రూ.కోటికి ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది.
కేదార్ జాదవ్ మిడిలార్డర్లో ఆడే సంగతి తెలిసిందే. అయితే అంచనాల మేరకు ఎప్పుడూ ఆకట్టుకోలేదు. ఐపీఎల్ కెరీర్లో ఎక్కువగా దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 41 మ్యాచుల్లో 24.61 సగటు, 134.44 స్ట్రైక్‌రేట్‌తో 566 పరుగులు చేశాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌కు 23 మ్యాచులాడి 20.67 సగటు, 96.50 స్ట్రైక్‌రేట్‌తో 248 రన్స్ సాధించాడు. ఇప్పుడు ఆడబోయే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 17 మ్యాచులాడి 25.75 సగటు, 141.74 స్ట్రైక్‌రేట్‌తో 309 పరుగులు చేశాడు. కోచీ టస్కర్స్ కేరళ, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కూ ఆడాడు. ప్రస్తుతం కేదార్ వయసు 38 ఏళ్లు. ఈ సీజన్లో లేటు వయసులోనూ అమిత్ మిశ్రా, పియూష్ చావ్లా వంటి స్పిన్నర్లు రాణిస్తున్నారు. మరి కేదార్ ఏం చేస్తాడో చూడాలి!
ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నాలుగు మ్యాచులు గెలిచి నాలుగు ఓడింది. -0.139 రన్‌రేట్‌తో ఉంది. ఇప్పటి వరకు ఆడిన ఎనిమిదిలో ఆరు తమ హోమ్ గ్రౌండ్ చిన్నస్వామిలోనే ఆడింది. ఇక ముందు ఆడబోయే మ్యాచుల్లో ఎక్కువగా ఇతర గ్రౌండ్లలోనే ఆడాలి. ఇది కాస్త ప్రతికూల అంశమే! బెంగళూరుతో పోలిస్తే మిగిలిన మైదానాల్లో బౌండరీలు సైజులు పెద్దవి. అన్నీ బ్యాటింగ్‌కు అనుకూలించకపోవచ్చు. మిడిలార్డర్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న జట్టుకు ఇది మరింత బాధాకరం అవుతుంది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో ఏకనా స్టేడియంలో తలపడుతోంది.