Fishermen Protest at Vizag Fishing Harbour: విశాఖపట్నం హార్బర్ వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. గురువారం రాత్రి దాదాపు 8 గంటల నుంచి విషవాయువులు లీక్ అవ్వడం కలకలం రేపింది. విషవాయువులు లీక్ కావడంతో (Poisonous Gases leaked at Vizag Fishing Harbour ) కళ్లు మండాయని, కొందరు వాంతులు అయినట్లు తెలుస్తోంది. ప్రాణ భయంతో చిన్నపిల్లలతో కలిసి మత్స్యకారులు కొద్దిదూరం పరుగులు పెట్టారు. నేషనల్ ఇన్స్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ వద్ద మత్స్యకారులు ఆందోళనకు దిగారు. 


ప్రాణ భయంతో మత్స్యకారుల పరుగులు.. 
దాదాపు రాత్రి 8 గంటల ప్రాంతంలో విషవాయువులు లీక్ కావడంతో కళ్ళ మంటలు, వాంతులతో ఆందోళన చెందామని మత్స్యకారులు తెలిపారు. చిన్నపిల్లలతో పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకున్నాం అంటూ మత్స్యకారులు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అండ్ ట్రైనింగ్ వద్ద ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. అదే సమయంలో గేట్లు తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా మత్స్యకారులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు ఫైర్ ఇంజిన్, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మత్స్యకారుల ఆందోళనను పోలీసులు అడ్డుకుని వారిని వారించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తమకు ప్రాణహాని ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, తమ ప్రాణాలంటే ఎవరికీ లెక్క లేదా అని మత్స్యకారులు వాపోతున్నారు.


సీఐ తన చెంపపై కొట్టారని ఓ మహిళ ఆరోపించారు. ఈ విషయంపై విశాఖ నగర పోలీస్ కమిషనర్‌కు సీఐపై ఫిర్యాదు చేస్తామన్నారు. దాదాపు 2 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్న ఈ హార్బర్ ప్రాంతంలో పరిశ్రమల నుంచి విషవాయువులు లీక్ కావడం, లేక ఎప్పటికైనా పరిశ్రమ నుంచి తమకు ప్రాణహాని ఉందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు శుక్రవారం నుంచి ధర్నా చేసేందుకైనా తాము వెనుకాడబోమని మత్స్యకారులు అన్నారు. 


విశాఖలో పలుమార్లు విష వాయువులు లీక్..  
ఏపీలో జరిగిన విషాదాలలో విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఒకటని చెప్పవచ్చు. రెండున్నరేళ్ల కిందట వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ నుంచి స్టైరిన్‌ గ్యాస్‌ లీక్ కావడంతో 15 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషవాయువు లీక్ కావడంతో చుట్టుపక్కల చాలా మంది ప్రజలు ఎక్కడికక్కడ రోడ్లపైనే కుప్పకూలిపోయారు. ఊపిరాడక, శ్వాస తీసుకోలేక చిన్నాపెద్దా అనే తేడా లేకుండా కుప్పకూలిపోయిన చనిపోయారు. ఈ ప్రమాదంపై స్పందించిన వైఎస్ జగన్ ప్రభుత్వం భారీగా నష్ట పరిహారం ప్రకటించింది. కానీ పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేమని, ఇలాంటి విషాదాలు జరగకుండా ఏం చర్యలు తీసుకుంటారు అని ప్రజలలో భయాలు మాత్రం పోలేదన్నది వాస్తవం.
గతంలో విశాఖలో పలుమార్లు విష వాయువులు లీకైన సందర్భాలున్నాయి. పరవాడలోని ఫార్మాసిటీలో ఓ ఫార్మా ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు లీక్ అయిన ఘటన అప్పట్లో స్థానికులను  ఆందోళనకు గురిచేసింది. విశాఖ జిల్లా పరవాడలోని జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీ లో ఉన్న అడ్మిరన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ నుండి రసాయన విషవాయువులు లీక్ కావడంతో కార్మికులు ఒక్కసారిగా ఆందోళనకు గురై ప్రాణ భయంతో పరుగులు తీశారు. కళ్ళు మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఫార్మా కంపెనీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు కొందరు వాంతులు చేసుకోగా, మరికొందరు శ్వాస సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.