Panchakarla Ramesh Babu To Join Janasena:

  విశాఖ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఇటీవల అధికార పార్టీని వీడటం తెలిసిందే. జనసేన పార్టీలో చేరాలని పంచకర్ల నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలివారు. తన అనుచరులను పవన్ కళ్యాణ్ కి పరిచయం చేశారు. ఆదివారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. జులై 20న తాను జనసేన పార్టీలో చేరుతున్నట్లు పంచకర్ల రమేష్ బాబు ప్రకటించారు.


పవన్ కళ్యాణ్ తో భేటీ అనంతరం మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ... ‘జనసేన పార్టీ భావజాలం, రాష్ట్ర శ్రేయస్సు కోసం  పవన్ కళ్యాణ్ పడుతున్న తపన చూసి తాను సైతం ఒక సైనికుడిలా ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. జనసేన భావజాలం నచ్చడంతో ఆ పార్టీలో చేరతానని పవన్ కళ్యాణ్ తో చెప్పగా ఆయన స్వాగతించారని చెప్పారు. జులై 20న తన అనుచరులతో మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి పార్టీలో జాయిన్ అవుతాను అని రమేష్ బాబు స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఉన్నతి కోసం కృషి చేస్తానన్నారు. పార్టీలో పవన్ కళ్యాణ్ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తాను అని ధీమా వ్యక్తం చేశారు. జనసేనలో సామాన్య కార్యకర్తగానే మెలుగుతాను. ఒక ఉద్యోగిలా ఉదయం 9కి వెళ్లి మధ్యాహ్నం క్యారేజ్ పట్టుకొని ఉద్యోగిగా బాధ్యతతో వైసీపీ లో పని చేశా అన్నారు. వైవీ సుబ్బారెడ్డి అంటే అపారమైన గౌరవం ఉందని, కానీ వైసీపీలో నా ఆత్మాభిమానం దెబ్బ తిన్నది అని వ్యాఖ్యానించారు.


వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు 
పార్టీలో జరుగుతున్న పరిణమాలకు మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నో ఆశయాలు, ఆశలతో రాజకీయాల్లోకి వచ్చానని అవి చేసే పరిస్థితి లేనపుడు పదవిలో కొనసాగడం సరికాదని భావించి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రాజీనామా తర్వాత పెందుర్తిలో ఆయన అనుచరులతో సమావేశం నిర్వహించారు. ఏ పార్టీలో చేరేది నేరుగా ప్రకటించలేదు కానీ..  తాను ఏ పార్టీలో చేరబోతున్నానన్నది మీ అందరికీ తెలుసని.. పెందుర్తి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తనకు సీటు హామీ ఇవ్వకపోవడంతో పంచకర్ల రమేష్ బాబు అసంతృప్తికి గురయ్యారు. 


పంచకర్ల రమేష్ రాజీనామా పై  వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పంచకర్ల రమేష్ రాజీనామా  తొందరపాటు చర్యగా పేర్కొన్నారు.  సమస్యలు ఏమైనా ఉంటే నాతో చర్చించి ఉంటే బాగుండేదని..  రమేష్ నాతో చర్చించిన సమస్యలన్నింటికీ పరిష్కారం చూపానని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.  ముఖ్యమంత్రి ని కలిసే అవకాశం రాలేదనడం కూడా అబద్ధమేనని..  సీఎం విశాఖ వచ్చిన ప్రతిసారీ రమేష్ ముఖ్యమంత్రిని కలిసేలా అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాననన్నారు.  పార్టీలో మొదటి నుంచి ఉన్న వారిని కాదని కొత్తగా పార్టీలో చేరిన రమేష్ కు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి గౌరవించామని.. కానీ రమేష్ దానిని నిలుపుకోలేదని ఆరోపిచారు. 
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial