Chandra Babu: విజయనగరం జిల్లా రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణను రాజకీయ కారణాలతో హత్యే చేయడం దారుణం అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన హత్యను తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలకు ప్రభుత్వ పెద్దలు, అధికారుల ఉదాసీన వైఖరే కారణం అని ధ్వజమెత్తారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. 


ఏగిరెడ్డి కృష్ణ ఎలా చనిపోయారంటే..?


విజయనగరం జిల్లా రాజాంలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు 58 ఏళ్ల ఏగిరెడ్డి కృష్ణ శనివారం ఉదయం రోజూలాగే తన ఇంటి నుంచి బైక్ పై బడికి బయలు దేరారు. తెర్లాం మండలం కాలంరాజుపేటలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన ఒమ్మి సమీపంలోని కొత్తపేటకు చేరుకోగానే ఓ బొలెరో వాహనం వచ్చి ఆయన బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే అది ముమ్మాటికీ హ్తయలాగే కనిపిస్తుందని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి.. ఇది హత్యేనని తేల్చారు. మృతుడి కుమారుడు శ్రావణ్ కుమార్ కేసు పెట్టగా.. ఉద్దవోలుకు చెందిన మరడాన వెంకట నాయుడు, మోహన రావు, గణపతి, రామస్వామిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీఐ రవికుమార్ తెలిపారు. 


హత్యకు కారణం ఇదేనా..?


ప్రభుత్వ ఉపాధ్యాయుడు కృష్ణ టీపీడీలో క్రియాశీలకంగా పని చేసే వారు. ముఖ్యంగా ఉద్దవోలుకు 1988 నుంచి 1995 వరకు సర్పంచిగా కూడా పని చేశారు. 1998లో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత నుంచి గ్రామంలో కృష్మ ఎవరికి మద్దతు తెలిపితే వారే సర్పంచిగా గెలిచేవారు. 2021 ఎన్నికల్లో ఆయన మద్దతుతో సర్పంచిగా నెగ్గిన సునీత ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత వీరిద్దరూ వైసీపీలో చేరారు. అప్పటికే ఆ పార్టీలో ఉన్న వెంకటనాయుడు దీన్ని జీర్ణించుకోలేక పథకం ప్రకారం కృష్ణను హత్య చేసినట్లు ఆయన భార్య జోగేశ్వరమ్మ, కుమారుడు శ్రావణ్ కుమార్, కుమార్తె ఝాన్సీ ఆరోపిస్తున్నారు. అయితే ముందుగా కృష్ణను వాహనంతో ఢీకొట్టి అనంతరం కొద్దిదూరం ఈడ్చుకెళ్లి రాడ్ తో తలపై మోదడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 


అయితే పోస్టుమార్టం నిమిత్తం ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీసులు... పోస్టుమార్టం పూర్తవ్వగానే కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఈరోజు ఉదయమే ఆయన అంత్యక్రియలు ఉద్దవోలులో ముగిశాయి. కృష్ణ స్వగ్రామమైన ఉద్దవోలులో పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది.