భారత్ -సౌత్ ఆఫ్రికా దేశాల మధ్య మంగళవారం జరిగే అంతర్జాతీయ టీ 20 మ్యాచ్‌కు విశాఖ నగరం  సిద్దమైంది. దీనికోసం అధికారులు, నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అంతవరకూ బానే ఉంది కానీ టికెట్స్ మాత్రం పక్కదారి పట్టించారు అని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ సిటీలోని ACA -VDCA (మధురవాడ ) స్టేడియం, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం, జ్యోతి థియేటర్ వద్ద టికెట్స్  అమ్ముతామన్న నిర్వాహకులు.. ఒక్కో కేంద్రంలో 10 నుంచి 15 టికెట్స్ అమ్మి చేతులు దులిపేసుకున్నారు అంటున్నారు క్రీడాభిమానులు . టికెట్స్ అమ్ముతామన్నారని ఉదయం నుంచి పడిగాపులు కాసినా ఫలితం లేకుండా పోయిందని క్రికెట్ లవర్స్ అంటున్నారు. నిజానికి మ్యాచ్ టికెట్లలలో 25 శాతం టికెట్స్‌ను ఆఫ్ లైన్‌లో అమ్ముతామని నిర్వహాకులు ప్రకటించారనీ... కానీ వాటిలో కొన్ని మాత్రమే కౌంటర్ల వద్ద అమ్మారని అంటున్నారు అభిమానులు. 

 

600 రూపాయల టికెట్స్ లేవు ... 1500 టికెట్స్ అమ్మరు 

 

క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి 600 రూపాయలు,1500 రూపాయల టికెట్స్ అమ్మకానికి పెట్టగా.. 600 రూపాయల టికెట్స్ కొన్నిమాత్రమే అమ్మారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. తరువాత అవి అయిపోయాయని చెప్పి .. 1500 రూపాయల టికెట్స్ ఉన్నాయని కౌంటర్ల వద్ద చెప్పారని అభిమానులు అంటున్నారు. పోనీ అవన్నా కొందామంటే వాటిని కూడా సరిగ్గా అమ్మలేదని ఆరోపిస్తున్నారు. కొంతసేపటి తర్వాత సర్వర్ సమస్య అంటూ అమ్మకాలు నిలిపివేసి.. అనంతరం 2000 రూపాయల టికెట్స్ మాత్రమే ఉన్నాయని అన్నారని వాపోయారు. టికెట్స్ కోసం లైన్లలో నిలబడి నిరాశ చెందామంటున్న విశాఖవాసులు. అలాగే మొదట నిర్వాహకులు మనిషికి రెండు టికెట్స్ అమ్ముతామని చెప్పినా కొన్ని చోట్ల ఒక్కోటే అమ్మారని వారు ఆరోపిస్తున్నారు. 

 

స్టేడియం సామర్థ్యం 27,000 కానీ ... 

 

విశాఖలోని మధురవాడ క్రికెట్ స్టేడియం కెపాసిటీ 27000. ఇందులో 25 శాతం వరకూ టికెట్స్ కౌంటర్ల వద్ద అమ్ముతామని చెప్పిన నిర్వాహకులు ఏ ధర టికెట్ ఎన్ని అందుబాటులో ఉంచుతామన్న వివరాలు వెల్లడించలేదు. అన్ని ధరల టికెట్స్ కలిపి 6700 వరకూ అమ్మినట్టు చెబుతున్నా అవన్నీ కౌంటర్లలో అమ్మలేదని క్రికెట్ లవర్స్ అంటున్నారు. అలాగే ఆన్లైన్ లోనూ 2000,3000 టికెట్స్ ఎక్కువగా అందుబాటులో ఉంచారు నిర్వాహకులు అంటున్నారు. ఏదేమైనా కోవిడ్ కారణంగా మూడేళ్లపాటు సైలెంట్ గా ఉన్న విశాఖ క్రికెట్ స్టేడియం లో మళ్ళీ ఇండియా -సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కారణంగా సందడి నెలకొంది. అయితే ఆ మ్యాచ్ ను స్టేడియంలో కూర్చుని కళ్లారా చూద్దామని  ఆశపడ్డ ఫాన్స్ కు మాత్రం నిరాశే ఎదురైంది అంటున్నారు వారు.