Vishakha Land Scam: విశాఖ జిల్లా రిషికొండ ఐటి సెజ్ స్థలంలో బినామీ పేర్లతో కోట్ల విలువ చేసే భూమిని ప్రభుత్వ పెద్దలు అన్యాక్రాంతం చేశారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎన్సీసీ (NCC) భూ వ్యవహారం రూ. 1500 కోట్ల భూ పందేరంలో కీలక సూత్రధారులున్నారని టీడీపీ నాయకులు విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, పల్లా శ్రీనివాస్ లు తెలియజేశారు. అభివృద్ధి పేరుతో ఇప్పటికే సింగపూర్ కంపెనీతో ఎన్సీసీ సుమారు రూ. 75 కోట్లు పెట్టుబడి పెట్టించిందని అయితే విశాఖ కేంద్రంగా ఉన్న కీలక వైసీపీ నేత ఈ వ్యవహారంలో చక్రం తిప్పినట్లు వారు ఆరోపించారు. దీంతో బెంగుళూరుకు చెందిన జీఆర్‌పీఎల్ (Grpl) హోసింగ్ కంపెనీ తెరపైకి వచ్చిందని సింగపూర్ కంపెనీని కాదని జీఆర్‌పీఎల్‌తో ఎన్సీసీ ఒప్పందం కుదుర్చుకుందంటూ వివాదం చెలరేగింది అని టీడీపీ నేతలు చెబుతున్నారు .
97 ఎకరాలను కేవలం రూ. 187 కోట్లకు హౌసింగ్ బోర్డ్ నుంచి ఎన్సీసీ తీసుకుందని మార్కెట్ వాల్యూ ప్రకారం భూమి విలువ సుమారు రూ.1500 కోట్లు ఉంటుందని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పేర్కొన్నారు. విశాఖను YSRCP MP విజయసాయిరెడ్డి నుంచి రక్షించాలంటూ నినాదాలు చేశారు. సీఎం జగన్, విజయసాయిరెడ్డిలు మళ్ళీ క్విడ్ ప్రో మొదలెట్టారంటూ నినాదాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రిషికొండ వద్ద టీడీపీ నేతలు భారీ ధర్నా చేపట్టారు
రూ.1500 కోట్ల స్థలాన్ని 187 కోట్లకు ఎలా ఇస్తారు
మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ రూ.1500 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని 187 కోట్లకు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. Ncc కి తక్కువ రేటు ఇవ్వడానికి కారణమేంటి, Grpl కంపెనీ ఎవరిదని ఆయన ప్రశ్నించారు. ఓపెన్ ఆక్షన్ పెట్టాలని తద్వారా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందన్నారు. విశాఖ నుంచి లూలు, టెంపుల్తన్ పంపేశారని, ఇపుడు సింగపూర్ కంపెనీని కూడా పంపేస్తున్నారని తెలిపారు. ఐటి సెజ్ భూ కేటాయింపులు రద్దు చేసేంతవరకూ టీడీపీ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏదేమైనా విశాఖలో వరుసగా బయటకికొస్తున్న భూ వివాదాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపి అసలు నిజాలు బయటకు తేవాలని విశాఖ వాసులు కోరుతున్నారు .