ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై టీడీపీ(TDP) మండిపడుతోంది. ఎలాంటి శాస్త్రీయత లేకుండా రాజకీయ కోణంలోనే జిల్లాల విభజన జరిగిందన్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు(Chandra Babu). రేపు టీడీపీ అధికారంలోకి వస్తే వాటన్నింటినీ సరిచేస్తామన్నారాయన. 


టీడీపీ సీనియర్ నేతలతో సమావేశమైన చంద్రబాబు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. వైసీపీ(YSRCP) పాలనలో రాష్ట్రం అదోగతి పాలైనందన్న చంద్రబాబు.. ఇప్పట్లో కోలుకోలేని విధంగా నాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ(YCP) విధానాల వల్ల రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 


విద్యుత్, పన్నుల భారంపై బాదుడే బాదుడు పేరుతో ఇంటింటికీ టీడీపీ  కార్యక్రమాన్ని చేపట్టాలని నేతలు సూచించారు చంద్రబాబు. కరెంట్‌ ఎందుకు పోతుందో... బిల్లులు ఎందుకు పెరుగుతున్నాయో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ వ్యక్తిగత ఆదాయం కోసమే ప్రజలపై భారం మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


అమరావతి 80శాతం జరిగిన పనులను కూడా జగన్ పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు చంద్రబాబు. జగన్ పాలనపై ఆయన సొంత నియోజకవర్గం కూడా సంతృప్తిగా లేదని అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత అవసరాల కోసమే జగన్ పదవులు ఇస్తున్నారని.. జగన్‌కు ఓటేసి తప్పుశామనే భావనలో ఇప్పుడు సొంత వర్గంలోనే చాలా మంది అనుకుంటున్నారన్నారు. 







సీపీఎస్‌ రద్దు విషయంలో ఆందోళనలు చేస్తున్న వారికి టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు చంద్రబాబు. అక్రమ మద్యం రవాణా ద్వారా జగన్ వేల కోట్లు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా నాసిరకం మద్యం అమ్ముతున్నారని విమర్శించారు. కల్తీ మద్యం, జే ట్యాక్స్‌పై పోరాటం కొనసాగించాలని శ్రేణులకు సూచించారు.