Visakhapatnam Palasa Passenger Railway Guard Dies:
ఏపీలో జరిగిన ఘోర రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపింది. విశాఖ - పలాస ప్యాసింజర్ రైలును అదే లైనులో వెనుక నుంచి వచ్చి విశాఖ - రాయగడ రైలు ఢీకొట్టింది. విజయనగరం జిల్లాలోని కొత్తవలస మండలం కంటకాపల్లి- అలమండ మధ్య ఆదివారం రాత్రి దాదాపు 7 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రైలు ప్రమాదంలో 15 మంది చనిపోగా, మరో వంద మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో విశాఖ- రాయగడ ప్యాసింజర్ రైలు ఇద్దరు లోకో పైలట్లు, విశాఖ - పలాస ప్యాసింజర్ రైలు గార్డు (Visakha Palasa Passenger Guard) ఎం.శ్రీనివాస్ ఉన్నారు.
చిన్ననాటి నుంచే కుటుంబ భారాన్ని భుజాలపై మోస్తూ..
రైలు ప్రమాదంలో కోల్పోయేది కొన్ని ప్రాణాలు మాత్రమే కాదు, కొన్ని కుటుంబాల జీవితాలు చిన్నాభిన్నం అవుతాయి. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయేవారు ఉంటారు. అలాంటి వారిలో విశాఖ - పలాస ప్యాసింజర్ రైలు గార్డు ఎం శ్రీనివాస్ ఒకరు. అయితే తనకు జీవితాన్ని ఇచ్చిన రైల్వేశాఖలోనే విధులు నిర్వర్తిస్తూ ఆయన ప్రాణాలు విడవటంతో కుటుంబం, బంధువులు విషాదంలో మునిగిపోయారు. రైల్వే గార్డు శ్రీనివాస్ మరణంతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రైలు ప్రమాదంలో చనిపోయిన మిగతావారి జీవితాలకు రైల్వే గార్డు శ్రీనివాస్ లైఫ్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. చిన్న తనంలోనే తండ్రి చనిపోతే ఏడుగురున్న ఆ కుటుంబానికి ఆయన నాన్నగా మారారు. తండ్రి బాధ్యత తాను తీసుకుని కుటుంబ భారాన్ని భుజాలపై మోశాడు. అమ్మకు ఏ కష్టం రాకుండా అనునిత్యం ఆమెకు అండగా నిలిచాడు.
తల్లిలా భార్యకు సేవలు చేసిన రైల్వే గార్డు
సోదరులు, చెల్లెళ్లకు అన్నీ తానై చూసుకున్నాడు. ఇద్దరు చెల్లెళ్లకు తానే పెళ్లి చేశాడు. రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్లను ఓ దారికి తెచ్చేందుకు తన జీవితం చివరి క్షణం వరకు సాయం చేశాడు. తన భార్య మానసిక సమస్యతో మంచాన పడితే, తల్లిలా మారి ఆమె ఇరవై ఏళ్లుగా సేవలు చేస్తున్నాడు. జీవితంలో కష్టాలు, బాధ్యతలే తప్ప సుఖం అనే మాట ఆయనకు తెలియదని బంధువులు చెబుతున్నారు. ఆయనకు ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. కానీ ఆయనకు జీవితాన్ని ఇచ్చిన రైల్వేశాఖలోనే గార్డుగా చివరి క్షణం వరకు సేవలు అందించాడు. విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయాడు.
ప్రమాదం జరిగిన తరువాత మృతులలో విశాఖ పలాస రైల్వే గార్డు ఎం శ్రీనివాస్ ఉన్నాడని అధికారులు నిర్ధారించారు. ఆ విషయాన్ని చెప్పడానికి సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత అధికారులు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. కాంటాక్ట్ లిస్టులో ఉన్న ఓ వ్యక్తికి ఫోన్ చేసి.. విజయనగరం జిల్లా కంటాకపల్లి సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో రైల్వే గార్డు శ్రీనివాస్ చనిపోయారని సమాచారం అందించారు. జీవితాంతం కుటుంబం కోసం ఎంతగానో శ్రమించిన తమ సోదరుడు శ్రీనివాస్ ఇకలేరన్న విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఎందుకంటే ఆయన వారికి అన్న మాత్రమే కాదు, నాన్నగా వారి జీవితాలకు దారి చూపిన గొప్ప మనసున్న వ్యక్తి. మంచి వ్యక్తిని కోల్పోయామని స్థానికులు చెబుతున్నారు.
Also Read: ఘోర రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణం - అధికారుల ప్రాథమిక నిర్ధారణ