Man pushed to death out of moving bus: బస్ ఛార్జీకి డబ్బులు ఉన్నాయో లేవో చెక్ చేసుకోలేకపోవడం తన ప్రాణాల మీదకి తెస్తుందని యువకుడు అనుకోలేదు. బస్ ఛార్జీకి డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో బస్ డ్రైవర్, క్లీనర్ ఆ యువకుడ్ని రన్నింగ్ బస్ నుంచి బయటకు నెట్టేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఏదో బిహార్, యూపీ లాంటి రాష్ట్రాల్లో కాదు.. ఏపీలో జరిగిందని తెలిసి తెలుగు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
అసలేం జరిగిందంటే..
జి భరత్ కుమార్ అనే 27 ఏళ్ల యువకుడు తన స్నేహితులతో కలిసి విశాఖపట్నం నుంచి కారులో శ్రీకాకుళం వెళ్లాడు. అయితే ఏదో పని ఉండి స్నేహితులతో కాకుండా ముందే విశాఖకు తిరిగి రావాలనుకున్నాడు. స్నేహితులు భరత్ కుమార్ ను భువనేశ్వర్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్ ఎక్కించారు. మే 3న రాత్రి దాటిన తరువాత శ్రీకాకుళంలో బస్ ఎక్కిన భరత్ ను కండక్టర్ టికెట్ ఛార్జీలు ఇవ్వమని అడిగాడు. బస్ ఛార్జీ రూ.200 అవుతుందని కండక్టర్ (క్లీనర్) అప్పన్న చెప్పగా.. తన వద్ద డబ్బులు లేవని భరత్ చెప్పడంతో డ్రైవర్ రామక్రిష్ణ, కండక్టర్ సీరియస్ అయ్యారు. డబ్బులు లేకుండా బస్ ఎక్కడం ఏంటని ప్రశ్నించారు. అయితే తన స్నేహితులతో కలిసి కారులో శ్రీకాకుళం వచ్చానని, అర్జంటుగా పని ఉందని ఇంటికి తిరిగి వెళ్తున్నానని చెప్పాడు భరత్ కుమార్. ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి ఫోన్ పే చేయిస్తానని చెప్పడంతో డ్రైవర్, కండక్టర్ సరేనన్నారు. అయితే ఎంత సేపటికి భరత్ స్నేహితులు బస్ ఛార్జీ డబ్బులు ఫోన్ పో చేయలేదు. దీంతో మరోసారి ఫోన్ చేయాలని భరత్ కుమార్ చెప్పగా.. అతడు ఫ్రెండ్స్ కు కాల్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని ఏదో చెప్పే ప్రయత్నం చేయడంతో ప్యాసింజర్ భరత్ తో డ్రైవర్ రామకృష్ణ, కండక్టర్ అప్పన్న గొడవకు దిగారు. ఆ తరువాత కదులుతున్న బస్సు నుంచి భరత్ కుమార్ ను రోడ్డుమీదకి నెట్టేశారు. ఈ ఘటనతో తీవ్రంగా గాయపడిన యువకుడ్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. మూడు రోజుల తరువాత డ్రైవర్ రామకృష్ణ, కండక్టర్ అప్పన్న భయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయారు. తాము తప్పు చేశామని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య అభియోగంపై ఇద్దర్ని అరెస్ట్ చేశారు. అయితే బస్ ఛార్జీలకు డబ్బులు లేవని చెప్పిన యువకుడ్ని రన్నింగ్ బస్ నుంచి నెట్టివేయడం పై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులతో మర్యాదగా ప్రవర్తించాల్సింది పోయి, ఓ వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణం అయ్యారని తీవ్రంగా విమర్శించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి బంధువులు, కుటుంబసభ్యులు పోలీసులను కోరారు.