AP CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ నెల 11వ తేదీన విశాఖలో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ టూర్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించారు. ఈ నెల 11న మధ్యాహ్నం 2.20 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా పీఎం పాలెంలోని వైఎస్సార్ స్టేడియం బి గ్రౌండ్ కు జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు. అనంతరం పలు కార్యక్రమాల్లో ఏపీ సీఎం జగన్ పాల్గొంటారు. 


సాయంత్రం 4.30 నుంచి 4.50 గంటల మధ్య భీమిలి నియోజకవర్గ నేతలతో ఆయన సమావేశం అవుతారు. సమావేశం ముగిసిన అనంతరం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి సీఎం జగన్ వెళ్తారు. 5.05 గంటలకు అపోలో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. అనంతరం ఫోటో సెషన్, రేడియేషన్ ఎక్విప్మెంట్ వీక్షణ ఉంటుంది. తర్వాత 5.35 గంటలకు ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ఆరిలోవ అపోలో ఆసుపత్రి నుండి సీ హేరియర్ మ్యూజియానికి బయలుదేరి వెళ్తారు. 6 గంటల వరకు బీచ్ రోడ్డులోని సీ హేరియర్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత రామ్ నగర్ లోని కమర్షియల్ కాంప్లెక్స్, ఎంవీపీ ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా ఫౌండేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ పాల్గొంటారు. ఆ తర్వాత ఎండాడ వద్ద కాపు భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం భీమిలి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భూమి పూజా చేస్తారు.


జగనన్నకు చెబుదాం ప్రారంభం.. 
ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే దిశగా పాలన సాగుతోందని, వ్యవస్థలో మార్పు తీసుకు వచ్చేందుకు జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ప్రతీ మంచి పనికి కూడా మాకు ఎంతిస్తారనే గుణం టీడీపీది అని విమర్శలు గుప్పించారు. టీడీపీ హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చిన దాఖలాలు కూడా లేవని ఎద్దేవా చేశారు. తమ పార్టీకి చెందిన వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు ఇచ్చేవారని ఆరోపించారు. అలాగే గత ప్రభుత్వ పాలనలో అడుగడుగునా వివక్ష ఉండేదని, తన పాదయాత్రలో ప్రజల సమస్యలను గమనించినట్లు సీఎం జగన్ వెల్లడించారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు పథకాలు అందాలని, వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకే జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వివరించారు. సంతృప్త స్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా ప్రజలకు నిర్ణీత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలు అందించే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళ వారం రోజే శ్రీకారం చుట్టారు. క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమం కోసం ప్రత్యేకంగా 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేశారు. 


మే 24న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టూర్


తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో ఈ నెల 5వ తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన వాయిదా పడినట్లు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ఇదే నెల 24వ తేదీన సీఎం జగన్ పర్యటన ఉంటుందని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, వర్షం కారణంగా ముఖ్యమంత్రి పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చిందని వివరించారు. అలాగే ' వాలంటీర్లకు వందనం' కారక్రమంలో భాగంగా వాలంటీర్లకు నగదు పురస్కారాల ప్రదానం కార్యక్రమాన్ని మే 24వ తేదీన కొవ్వూరులో నిర్వహిస్తామని మంత్రి తానేటి వనిత వివరించారు.