Breaking News Today |  విశాఖపట్నం: విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. విశాఖ మహా నగర పాలక సంస్థలో వైసీపీ పట్టు కోల్పోతోంది. జీవీఎంసీకి చెందిన 14 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. పార్టీ మారవద్దని మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. దాంతో వైసీపీ కార్పొరేటర్లు 14 మంది టీడీపీలో చేరిపోయారు. 


జీవీఎంసీ పరిధిలో విశాఖ ఈస్ట్, నార్త్, సౌత్, భీమిలి, గాజువాక  ప్రాంతాలకు చెందిన వైసీపీ కార్పోరేటర్లు ఆదివారం నాడు అధికార పార్టీ టీడీపీలో చేరారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో జరుగుతున్న కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లకు టీడీపీ కండువా కప్పి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ చేరికల కార్యక్రమంలో విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వంశీకృష్ణ, పార్టీ నేతలు  పాల్గొన్నారు.



ఇటీవల అమర్ నాథ్ నిర్వహించిన సమావేశానికి హాజరైన కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న సమయంలో తమను ఎవ్వరు పట్టించుకోలేదని వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మాజీ మంత్రి చేతులెత్తేయాల్సిన పరిస్థితి నెలకొంది.  విశాఖ జీవీఎంసీ పరిధిలో 98 డివిజన్ లు వుండగా 58 వైసీపీ, 30 టీడీపీ, 10 మంది జనసేన, బిజెపి ఇతర పార్టీలు వారు గెలిచారు. తాజా చేరికలు గమనిస్తే.. సగానికి సగం వైసిపి నుంచి టీడీపీ, జనసేనలో చేరే అవకాశం ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు.