Visakhapatnam East: విశాఖ తూర్పు నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఒకప్పుడు విజయం కోసం పోటీ పడిన ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు ఒకటయ్యారు. మరో నేతపై ఇరువురు విమర్శనాస్త్రలు సంధిస్తున్నారు. ఒకప్పుడు రాజకీయంగా పోటీ పడి, ఇప్పుడు ఏకతాటికిపై వచ్చిన ఆ ఇద్దరి నేతలే ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఈ ఇద్దరు నేతలకు ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరు నేతలు సుమారు 15 ఏళ్లపాటు రాజకీయంగా ఒకరిపై మరొకరు పోరాటాన్ని సాగించారు. రెండు ఎన్నికల్లో ప్రత్యక్షంగా ఇరువురు నేతలు పోటీ పడ్డారు. రోజులు మారాయి. రాజకీయాలు మారాయి. ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు. ఇప్పుడు మరో నేతపై ఇద్దరు నేతలు కత్తులు దూస్తున్నారు. గడిచిన మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యే వెలగపూడి ఓటమికి కంకణం కట్టుకున పని చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్.. ఇప్పుడు అదే వెలగపూడిని గెలిపించాలని కోరుతున్నారు. ఇదే ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది.
రెండు ఎన్నికల్లో ఓడిపోయిన వంశీ
విశాఖ తూర్పు నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. ఇప్పటి వరకు మూడు ఎన్నికలు జరగ్గా, మూడుసార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వెలగపూడి రామకృష్ణబాబు ఇక్కడ విజయం సాధించారు. 2009, 2014 ఎన్నికల్లో వెలగపూడిపై పోటీ చేసిన వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఓటమి పాలయ్యారు. 2009లో తొలిసారి ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ 4031 ఓట్ల తేడాతో వెలగపూడిపై ఓటమి పాలయ్యారు. రెండోసారి 2009లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన వెలగపూడి మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు. ఈ ఎన్నికల్లో కూడా వంశీకృష్ణ శ్రీనివాస్‌పైనే ఆయన విజయం సాధించారు. ఈసారి వైసీపీ నుంచి బరిలోకి దిగిన ఆయన.. 47,883 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గడిచిన ఎన్నికల్లో మూడోసారి వెలగపూడి విజయం సాధించారు. ఈసారి వైసీపీ నుంచి అక్కరమాని విజయనిర్మల బరిలోకి దిగారు. 26,474 ఓట్ల తేడాతో ఆమె విజయం సాధించారు. గడిచిన 15 ఏళ్ల నుంచి వెలగపూడిపై రాజకీయంగా పోరాడుతున్న వంశీకృష్ణ శ్రీనివాస్.. ఇప్పుడు ఆయన విజయం కోసం పన చేసేందుకు సిద్ధమయ్యారు.
ఎంవీవీని ఓడించడమే లక్ష్యమంటూ ప్రకటన
తాజాగా ఈ ఇద్దరి నేతలు గురువారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయంగా ఏళ్ల నుంచి పోటీ పడుతున్న ఈ ఇద్దరు నేతలు తొలిసారి స్నేహితులుగా మారి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైసీపీలో ఇబ్బందులు పడుతున్నానంటూ బయటకు వచ్చిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ జనసేనలో చేరారు. నగర పార్టీ అద్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఇరు పార్టీలు మద్య పొత్తు ఉంది. సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. కానీ, ఇక్కడి నుంచి ఎమ్మెల్యే వెలగపూడిని గెలిపించాలంటూ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మీడియా ముఖంగా ప్రజలను కోరారు. ఎమ్మెల్యే వెలగపూడికి ఓటేయాలని కోరిన.. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంవీవీ సత్యనారాయణను ఓడించాలని, కబ్జాదారులను గెలిపించవద్దంటూ కోరారు. తనను అభిమానించే ప్రతి ఒక్కరూ వెలగపూడి రామకృష్ణబాబుకు ఓటేయాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే ఎంవీవీ అంతు చూస్తామంటూ వంశీ ప్రకటించారు. ఎంవీవీ అక్రమాలు, అన్యాయాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, అధికారంలోకి వచ్చిన తరువాత చట్టం పని తాను చేసుకునేలా చేస్తామని ఇద్దరు నేతలు ప్రకటించారు. ఏది ఏమైనా ఏళ్ల నుంచి రాజకీయ వైరాన్ని కొనసాగించిన నేతలు ఒక్కటి కావడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకే అంటారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులు ఉండరని. ఈ సామెతకు తూర్పు నియోజకవర్గం ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని పలువురు పేర్కొంటున్నారు. చూడాలి రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి ఏకమైన సాగిస్తున్న తూర్పు రాజకీయం.. ఎంత వరకు సఫలం అవుతుందో.