Atchutapuram SEZ : అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలింది. ఈ ప్రమాదం 18 మంది కార్మికులను పొట్టనపెట్టుకుంది. అయితే... ఈ ప్రమాదానికి కారణం ఏంటి...? కంపెనీ  యాజమాన్యం నిర్లక్ష్యమేనా...? భద్రత ప్రమాణాలు పాటించకపోవడమేనా...? అంటే.. అవుననే అంటున్నారు ఫార్మా రంగం నిపుణులు. ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి... పాతకాలం రియాక్టరే కారణమని స్పష్టం చేస్తున్నారు. ఫార్మా కంపెనీల్లో  రియాక్టర్లదే కీలక పాత్ర. వీటిలోనే రసాయనాలను కలుపుతారు. ఈ క్రమంలో... కొలతల్లో తేడా వచ్చినా... పీడనం, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు ఉన్నా... రియాక్టర్లు పేలిపోతాయి. ఎసెన్షియా ఫార్మా కంపెనీలోనూ ఇదే జరిగిందంటున్నారు నిపుణులు.  ఫార్మా కంపెనీల్లో తరచూ రియాక్టర్లు పేలడానికి సరైన పర్యవేక్షణ లేకపోవడమే కారణమని చెప్తున్నారు.


చాలా కంపెనీలు ఇప్పటికీ పాత రియాక్టర్లనే వాడటం కూడా ప్రమాదాలకు దారితీస్తోందని అంటున్నారు. నిపుణులు అత్యాధునిక రియాక్టర్లలో అయితే..  ఎక్సో థర్మల్‌ రియాక్షన్‌ మొదలవగానే దానికదే నీటిని వెదజిమ్ముకోవడం.. లేదా ఉష్ణోగ్రతను తగ్గించుకోవడం చేస్తోంది. అలాగే.. తీవ్రతను బట్టి దానికదే ఆగిపోతుంది కూడా. కానీ.. పాత రియాక్టర్లనే ఆ ఫీచర్లు ఏవీ ఉండవు. దీంతో... తేడా వస్తే ...  పేలుళ్లు తప్పవని అంటున్నారు. అచ్యుతాపురం సెజ్‌లోనే కాదు.. మన దేశంలో ఇప్పటికీ చాలా కంపెనీల్లో పాత రియాక్టర్లనే వాడుతున్నారు. కొత్త రియాకర్లు ఖరీదైనవి కావడంతో... పాతకాలం రియాక్టర్లనే కొనగిస్తున్నారు. 


పాతకాలం రియాక్టర్లతో అప్రమత్తంగా ఉండాలి...
అచ్యుతాపురం సెజ్‌లో 280 ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ప్రతి కంపెనీలోనూ రియాకర్టు ఉంటాయి. ఈ రియాక్టర్లలో అధిక ఉష్ణోగ్రతల మధ్య రసాయనాలను మరిగించాల్సి ఉంటుంది. అయితే.. రియాక్టర్‌పై ఒత్తిడి పెంచే సమయంలో నిపుణులు,  కార్మికులు నిరంతరం పర్యవేక్షించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా... వేడిని తట్టుకోలేని రియాక్టర్లు పేలిపోతాయి. 140 నుంచి 180 డిగ్రీలకు ఉష్ణోగ్రత పెరుగుతుంటే.. వెంటనే రియాక్టర్‌ను చల్లబరచాలి.  రసాయనాలను మరిగించడం ఆపేయాలి. లేదంటే పేలుడు తప్పదు. 


రియాక్టర్లు పేలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
ఫార్మా కంపెనీల్లో రియాక్టర్లు పేలడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రియాక్టర్ల దగ్గర తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. ప్రమాదాలను నివారించవచ్చని అంటున్నారు నిపుణులు. ఫార్మా, కెమికల్ ఫ్యాక్టరీల్లోని రియాక్టర్ల దగ్గర ఉష్ణోగ్రతలు, ప్రెషర్‌ గేజ్‌లు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఒత్తిడి ఎక్కువకాగానే.. అలారం మోగే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. రియాక్టర్లు ప్రెజర్‌ కుక్కర్ల లాంటింది. కుక్కర్లలో ప్రెజర్‌ ఎక్కువనప్పుడు.. ఆవిరి విజిల్‌ నుంచి బయటకు వచ్చేస్తుంది. అలాగే.. రియాక్టర్లలోనూ రప్చర్‌ డిస్క్‌ ఉంటుంది. ప్రెషన్‌ ఎక్కువైనప్పుడు ఆ డిస్క్‌ ఊడిపోయి.. ఆవిరి బయటకు వచ్చేస్తుంది. దీంతో రియాక్టర్లపై ఒత్తిడి తగ్గుంది. ఆవిరి బయటకు రాన్నప్పుడే ప్రమాదాలు జరుగుతునాయి. కనుక...  అంత కీలకమైన పనిని.. నిపుణులకు అప్పగించాల్సి ఉంటుంది. కానీ.. కంపెనీల్లో నిపుణులకు అధిక జీతాలు ఇచ్చేకన్నా... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారని తెలుస్తోంది. వారు.. తెలిసీతెలియక చేసే చిన్న  పొరపాట్లు.. ప్రమాదాలకు కారణం అవుతున్నాయని భావిస్తున్నారు. 


1997 నుంచి ఇప్పటి వరకు విశాఖలోని పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాలు...


1997 నుంచి ఇప్పటి వరకు విశాఖలోని పరిశ్రమల్లో 23 ప్రమాదాలు...
1997 సెప్టెంబర్‌ 14: HPCL లిక్విఫైడ్‌ పెట్రోలియం స్టోరేజ్‌లో పేలుడు, 22 మంది మృతి
2012 జూన్‌ 13: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పేలుడు, 11మంది మృతి
2014: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్బన్‌ మోనాక్సైడ్‌ లీక్‌, ఇద్దరు ఇంజినీర్లు మృతి
2018 జనవరి 22: JNPCలోని సైనార్‌ లైఫ్‌ సైన్సెస్‌లో పేలిన రియాక్టర్‌, ఇద్దరు మృతి
2019 డిసెంబర్‌ 27: పరవాడ JSPCలోని స్మైలాక్స్‌ లాబ్స్‌లో విషవాయువు లీక్‌, ఇద్దరు మృతి


2020లో విశాఖలోని పరిశ్రమల్లో నాలుగు ప్రమాదాలు...
2020 మే 7: వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీక్‌, 12 మంది మృతి
2020 జూన్‌ 30: పరవాడలోని ఫార్మా కంపెనీలో బెంజీన్‌ గ్యాస్‌ లీక్‌, ఇద్దరు మృతి
2020 జులై 13: పరవాడ JNPCCలోని కంపెనీలో అగ్నిప్రమాదం, ఒకరు మృతి
2020 ఆగస్టు 1: హిందూస్థాన్‌ షిప్‌యార్డులో క్రేన్‌ ప్రమాదం, 11మంది మృతి


2021లో విశాఖలోని పరిశ్రమల్లో మూడు ప్రమాదాలు...
2021 సెప్టెంబర్‌ 21: అభిజిత్‌ ఫెర్రోలో గ్యాస్‌ లీక్‌, ఆరుగురికి గాయాలు
2021 నవంబర్‌ 29: రామ్‌కీ ఫార్మాసిటీలో టాక్సిక్‌ గ్యాస్‌ లీక్‌, ఇద్దరు మృతి
2021 డిసెంబర్‌ 25: పరవాడ ఫార్మా కంపెనీలో గ్యాస్‌ లీక్‌, ఇద్దరు మృతి


2022లో విశాఖలోని పరిశ్రమల్లో నాలుగు ప్రమాదాలు...
2022 ఏప్రిల్‌ 23: పరవాడ జేఎస్‌ ఫార్మాసిటీలోని SNF ప్రైవేట్‌ లిమిటెడ్‌లో అగ్నిప్రమాదం
2022 ఆగస్టు: అచ్యుతాపురం సెజ్‌లోని బ్రాండిక్స్‌ ఫ్యాక్టరీలో విషవాయువులు లీక్‌
2022 ఆగస్టు 8: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం
2022 డిసెంబర్‌ 26: JN ఫార్మాసిటీలోని లారస్‌ ల్యాబ్స్‌లో అగ్నిప్రమాదం, ఐదుగురు మృతి


2023లో విశాఖలోని పరిశ్రమల్లో ఐదు ప్రమాదాలు...
2023 జనవరి 31: అచ్యుతాపురం సెజ్‌లోని GFMS ఫార్మా కంపెనీలో రియాక్టర్‌ పేలుడు, ఒకరు మృతి
2023 ఫిబ్రవరి 11: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదం, 9 మందికి తీవ్ర గాయాలు
2023 ఏప్రిల్‌ 18: పరవాడలోని విష్ణు కెమికల్స్‌లో ప్రమాదం
2023 జూన్‌ 30: అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మాలో రియాక్టర్‌ పేలుడు, ఆరుగురు మృతి
2023: ఆగస్టు 10: పరవాడలోని NTPC సింహాద్రి పవర్‌ ప్లాంట్‌లో ప్రమాదం, ఇద్దరు మృతి


2024లో జరిగి ప్రమాదాలు...
2024 ఏప్రిల్‌ 6: పరవాడలోని విశాఖ ఫార్మాసిటీ రెండు ప్రమాదం, ఇద్దరు మృతి
2024 జులై 17: అచ్చుతాపురం సెజ్‌లోని వసంత్‌ కెమికల్స్‌లో రియాక్టర్‌ పేలుడు, ఒకరు మృతి