Accident In atchutapuram SEZ: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతు సంఖ్య ప్రస్తుతం 17కు చేరింది. ఈ దుర్ఘటనపై దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మోదీ... మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. వారికి రెండు లక్షల రూపాయల పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి యాభైవేల రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు.


రియాక్టర్ పేలుడుతో దుర్ఘటన


ఉదయం షిప్టు వాళ్లు పనులు ముగించుకొని వెళ్లే టైం, సాయంత్రం షిప్టు వాళ్లు వస్తూ డ్యూటీ ఎక్కుతున్న సమయం. అంతా ఈ హడావుడిలో ఉండగానే పెను ప్రమాదం కమ్మేసింది. ఎసెన్షియా అడ్వాన్స్‌డ్‌ సైన్సెస్‌ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. 500 కేఎల్‌ సామర్థ్యం గల రియాక్టర్ పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. ఏం జరుగుతోందో తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 


కుప్పకూలిన పైకప్పు


రియాక్టర్‌ పేలుడుతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు ధాటికి కంపెనీ పై కప్పు కూడా ఒక్కసారిగా కుప్పకూలింది. మరోవైపు దారి కనిపించని పొగ. ఇలా అన్ని ఒక్కసారిగా కార్మికులపై దాడి చేశాయి. దీంతో ఎవరు ఎటు వెళ్తున్నారో... ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇలా కన్ఫ్యూజ్ అవ్వడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని అంటున్నారు. కొన్ని మృతదేహాలు గుర్తు పట్టలేనంతంగా చిద్రమైపోయాయి. అవయవాలు ఎగిరిపడ్డాయి. మృతదేహాలు చెట్లకు వేలాడుతున్నాయి. 


అతి కష్టమ్మీద కతగాత్రుల తరలింపు 


ప్రమాదం జరిగిన ప్రదేశంలోకి వెళ్లి ఇన్‌టైంలో క్షతగాత్రులను రక్షించే సాహసం ఎవరూ చేయలేకపోయారు. చివరకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వచ్చిన తర్వాత కానీ అక్కడ ఏం జరిగింది. ఎంత విధ్వంసం జరిగిందన్నది బయట ప్రపంచానికి తెలియలేదు. తీవ్రంగా శ్రమించి ముందు మంటలు అదుపులోకి తీసుకొచ్చిన తర్వాత పరిశ్రమలోకి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెళ్లగలిగాయి. క్రేన్‌లను ఉపయోగించి క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చారు. ప్రొక్లైయిన్లను ఉపయోగించి శిథిలాలు తీశారు. అక్కడ ఛిద్రమై ఉన్న మృతదేహాలను అతి కష్టమ్మీద బయటకు తీసి పోస్టుమార్టానికి పంపించారు. 


బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు


ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ విశాఖ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు విశాఖ చేరుకుంటారు. అక్కడా నుంచి హెలికాప్టర్‌లో కోస్టల్‌ బ్యాటరీ చేరుకుంటారు. అక్కడి నుంచి కేజీహెచ్‌, మెడికవర్‌ హాస్పిటల్‌కి వస్తారు. చికిత్స పొందుతున్న బాదితులను పరామర్శిస్తారు. ధైర్యంగా ఉండాలని వారికి చెబుతారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తారు. ఆసుపత్రిలో పరామర్శలు అయినపోయిన తర్వాత ప్రమాదం జరిగిన అచ్యుతాపురం సెజ్‌కి చేరుకుంటారు. ప్రమాదంపై ఆరా తీస్తారు. అనంతరం అక్కడ అధికారులతో సమావేశమై చేపట్టాల్సిన చర్యలు గురించి చెబుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ కేజీహెచ్‌కు వచ్చి వైద్యాధికారులతో భేటీ అయ్యారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతోపాటు మొన్న కలుషిత ఆహారం తిని చికిత్స పొందుతున్న చిన్నారులను కూడా పరామర్శిస్తారు.