Essentia plant Incident: అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలో ప్రమాదం జరిగిందని మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రపంచానికి తెలిసింది. అయితే 10 మందికిపైగా గాయపడ్డారని... ఒక్కరే చనిపోయారని ముందుగా సమాచారం వచ్చింది. ఎప్పుడూ జరిగినట్టే జరిగి ఉంటుందని అంతా అనుకున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అధికారులు ఆ కంపెనీ లోపలికి వెళ్తే తప్ప ప్రమాద తీవ్ర ఎంతో అర్థం కాలేదు. చనిపోయింది ఒకరిద్దరు కాదని పదుల సంఖ్యలో అని తెలిసింది.
ముందు ఒకరే అనుకున్నా...
పేలుడు ధాటికి ఎగిసిన మంటల్లో కాలి చనిపోయింది ఒకరిద్దరే కావచ్చు కానీ ప్రమాదం కారణంగా కమ్మేసిన పొగ, కుప్పకూలిన బిల్డింగ్‌పైకప్పు కారణంగానే ఎక్కువ మంది ప్రాణాలు వదిలేశారు. సుమారు 40 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎసెన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో మధ్యస్థ కెమికల్స్ ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ దాదాపు నాలుగు వందల మంది ఉద్యోగులు రెండు షిప్టుల్లో పని చేస్తుంటారు. ప్రమాదం జరిగిన బుధవారం(22ఆగస్టు 2024) మొదటి షిప్టు కార్మికులు డ్యూటీ ముగించుకొని వెళ్లిపోతుండగా... రెండో షిఫ్టు వాళ్లు విధుల్లోకి వస్తున్న టైంలో ప్రమాదం జరిగింది.
రసాయన మేఘంతో ప్రమాదం
ఇలాంటి కంపెనీల్లో గ్యాస్ లీకైనప్పుడు గాలిలో కలిసిపోతే ప్రమాద తీవ్రత పెద్దగా ఉండదు. కానీ అదే ఓ రూమ్‌లో ఉండిపోతే పెను ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు అచ్యుతాపురంలోని ఎసెన్షియా పరిశ్రమలో జరిగింది కూడా అదే. ఓ గదిలో గ్యాస్ లీక్ కావడంతో ఆ గ్యాస్ ఓ ఆవిరి మేఘంలా మారిపోతుంది. మిథైల్ టెరిషరీ బుయటైల్ ఈథర్ గాలిలో కలిసింది. భవనంలో మూలమూలలకు వ్యాపించింది. ఇలా దట్టంగా పొగలా ఏర్పడిన ఆవిరి మేఘం పేలడంతో ప్రమాదం జరిగింది.
ప్రభుత్వానికి ప్రాథమిక సమాచారం అందజేత
వేపర్ క్లౌడ్ ఎక్స్‌ప్లోజన్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రభుత్వానికి కంపెనీ ఇచ్చిన ప్రాథమిక నివేదికలో పేర్కొంది. మూడో అంతస్తులో ఉన్న రియాక్టర్ నుంచి కింది అంతస్తులో ఉన్న ట్యాంకర్‌లోకి మిథైల్ టెరిషరీ బుయటైల్ ఈథర్ ద్రవ రసాయనాన్ని పంపిస్తున్న టైంలో ప్రమాదం జరిగినట్టు తెలిపారు. ఇలా పంపే టైంలో లీకై విద్యుత్ ప్యానల్స్‌పై పడి వేపర్ క్లౌడ్ ఏర్పడినట్టు వివరించారు. ఎలక్ట్రికల్ ప్యానల్స్, ఏసీ డక్టుల ద్వారా అంతటా వ్యాపించినట్టు పేర్కొన్నారు. అదే టైంలో విద్యుత్ తీగల ద్వారా వచ్చిన స్పార్క్ కారణంగా మటలు వ్యాపించాయని తెలిపారు. దీంతో ఒక్కసారిగా పొగలు అలుముకున్నాయని.... రియాక్టర్ కూడా పేలిందని సమాచారం ఇచ్చారు. ఈ ప్రమాద ధాటికి గ్రౌండ్‌ఫ్లోర్ శ్లాబ్, గోడ కూలినట్టు తెలిపారు.