Kishan Reddy - Madhav: బీజేపీ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్ధి మాధవ్ కు మద్దతుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. భారత్ దర్శన్ పథకంలో భాగంగా అరకు, లంబసింగిలకు కేంద్ర ప్రభుత్వం 75 కోట్లు మంజూరు చేసిందని ఆయన తెలిపారు. అన్నవరం, శ్రీశైలం, అమరావతి ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌లో కూడా అల్లూరి 125వ జయంత్యుత్సవాలు ఘనంగా చేస్తామని పేర్కొన్నారు. రాజమండ్రిలో సంగీత నాటక అకాడమీ ఏర్పాటు చేశామన్నారు. విశాఖలాంటి నగరానికి ప్రజల తలలో నాలుకలా ఉండే వ్యక్తిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని తెలిపారు. గత ఆరేళ్లలో మాధవ్ ఉత్తరాంధ్రకే పరిమితం కాలేదన్నారు. ఏపీ సమస్యలన్నిటి మీదా గళమెత్తారని కిషన్ రడ్డి పేర్కొన్నారు. ఆయన సమర్ధుడు అని తెలిపారు. ఈనెల 13వ తేదీన మరోసారి ఎన్నికలు జరుగుతున్నాయని.. అందరి ఆశీస్సులు, మద్దతు ఇచ్చి ఆయనను గెలిపించాలని కోరారు.
బాల్యం నుంచీ జన జీవితంలో ఉన్న వ్యక్తి మాధవ్ అని.. ఆయన తండ్రి చలపతిరావుగారు దేశభక్తికి, నిజాయతీకి, సేవా, అంకిత భావాలకీ ప్రతీక అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మాధవ్ కూడా వారి అడుగు జాడల్లో నడుస్తున్నారన్నారు. ఇక్కడ ఏ సమస్య వచ్చినా మాధవ్ ముందుకు వచ్చి పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పరిచయాలు, పలుకుబడి ఉన్న వారు.. ఏపీలో కుటుంబ రాజకీయాలు ప్రజలకు నష్టం చేస్తున్నాయన్నారు. రాజకీయాల్లో నాయకులు అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా సాగాలని తెలిపారు. కానీ కక్ష సాధింపులు, ప్రతీకారాలతో పొద్దుగడపకూడదని వివరించారు. ఈ ప్రాంతంలో రేపు ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉంటామన్నారు. కేంద్రం ఇచ్చే ప్రాజెక్టులు, సంస్థలూ ఉత్తరాంధ్రకు వచ్చేలా మాధవ్ సమన్వయం చేస్తారన్నారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ నినాదానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పర్యాటక శాఖ నుంచి ఈ ప్రాంతానికి భారీ పథకాలు ఇస్తామన్నారు.
"రానున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న నాకు వివిధ వర్గాలు మద్దతు ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. ఉత్తరాంధ్రకు కేంద్రం నుంచి ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయి. అన్ని రంగాలలో అభివృద్ధి సాగుతోంది. అనేక విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. వాటికి భవనాల నిర్మాణం సాగుతోంది. విప్లవ వీరుడు అల్లూరి పేరిట జిల్లా పెట్టుకున్నాం. భీమవరంలో విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ వచ్చారు. కేంద్రం సమన్వయంతో మరింత అభివృద్ధి సాధించటానికి మరోసారి ఎన్నుకోవాలని కోరుతున్నాను." - ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్
మోదీజీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తెలిపారు. మౌలిక వసతుల కల్పన నుంచి సుస్థిరాభివృద్ధికి అవసరమైన రెన్యూవబుల్ ఎనర్జీ వరకూ అన్ని రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వెనకబాటు తనాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ మరింత అభివృద్ధికి కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. గత ఆరేళ్లలో మాధవ్.. కేంద్ర సమన్వయంతో సేవలు అందించారన్నారు. ఆయన్ను మళ్లీ ఎన్నుకుని ఈ అభివృద్ధి నిరాటంకంగా కొనసాగేలా చూడాలని స్పష్టం చేశారు. విశాఖ పెట్టుబడుల సదస్సు విజయవంతం కావటం సంతోషదాయకం అని ఆయన వివరించారు. కేంద్రం తీసుకుంటున్న విధాన నిర్ణయాలు పారిశ్రామిక వేత్తలకు ఉత్తేజాన్నిస్తున్నాయని వెల్లడించారు.