Vishakha News : విశాఖ మహిళ శ్వేత మృతి కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ఇప్పుడు తాజాగా శ్వేత తల్లి చేసిన ఆరోపణలు సంచలనంగా మారుతున్నాయి. ఆ ఆరోపణలతోనే ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. 
వరుసకు అన్న అయ్యే ఆడపడుచు భర్త తనపై కన్నేశాడని శ్వేత తరచూ చెప్పేది అంటున్నారు ఆమె తల్లి. లైంగికంగా వేధించేవాడని ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై చాలా సార్లు ఇంట్లో గొడవలు జరిగాయన్నారు. అత్తింటి వాళ్లు ఎవరూ శ్వేతకు మద్దతుగా నిలవలేదని... దీంతో వేధింపులు మరింత రెట్టింపు అయినట్టు చెబుతున్నారు. 


ఇదే యాంగిల్‌లో విచారణ చేసిన పోలీసులకు మరికొన్ని విషయాలు తెలిసినట్టు సమాచారం. ఇప్పటికే శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన పోలీసులు... ఇది అనుమానాస్పద మృతిగానే కేసు రిజిస్టర్ చేసి విచారిస్తున్నారు. కేజీహెచ్‌లో ముగ్గురు వైద్యుల బృందంతో ఈ పోస్టుమార్టం నిర్వహించారు. ఆడపడుచు భర్త లైంగిక వేధింపుల విషయంలో కొన్ని ప్రాథమిక నివేదిక లభించినట్టు తెలుస్తోంది. 


విశాఖ ఆర్కే బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించిన ఇరవై నాలుగేళ్ల శ్వేత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. అత్తింటివారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నందున ఆమె కన్నవారే అంతిమసంస్కరణలు నిర్వహించారు. కేసులో ఇప్పటి వరకు లభించిన ఆధారాలతో శ్వేత ఆడపడుచు భర్తపై లైంగిక వేధింపుల కేసు, అత్త, ఆడపడుచుపై వరకట్న వేధింపుల కేసులు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆ దిశగానే విచారణ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో శ్వేత భర్త, అత్తామామ, ఆడపడుచు, ఆమె భర్త కూడా ఉన్నారు.