ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంట్లో కిడ్నాప్ ఎపిసోడ్ ఇంకా ట్రెండింగ్‌లో ఉంది. ప్రతిపక్షాలు దీనిపై సీబీఐ విచారణ జరపాలన్న డిమాండ్‌కు ఆయన కూడా స్వరం కలిపారు. ఎంటైర్ కిడ్నాప్ ఎపిసోడ్ పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నట్టు ప్రెస్‌మీట్‌ పెట్టి  చెప్పారు. 


విశాఖలో ప్రెస్‌మీట్‌ పెట్టిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ కేసులో సీబీఐ విచారణ జరిపితే కిడ్నాపర్లు ఇంట్లో ప్రవేశించిన నాటి నుంచి బయటకు వెళ్ళే వరకూ అన్ని బయటికి వస్తాయన్నారు. ఎర్ర గంగిరెడ్డితో తనకు లావా దేవీలు ఉన్నాయని చెప్పడం బాధగా ఉందన్నారు. వెయ్యి కోట్లు రూపాయలు లావా దేవీలు జరిగాయని ఆరోపణలు చేస్తున్నారని.. అసలు తన ఆస్తి మొత్తమే అంత ఉండబోదన్నారు. 


కిడ్నాపర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారి నెంబర్‌లు అడిగారని ఎంవీవీ తెలిపారు. గంజాయి తాగుతూ చాలా దారుణంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ వెనుక మరేతర కోణం ఉందా అంటూ మీడియాలో వచ్చిన కథనాలు బాధ కలిగించాయని తెలిపారు. హేమంత్,రాజేష్ ఇద్దరూ కూడా రౌడీ షీటర్‌లు అని.. జైలు లో ప్లాన్ వేసుకున్న ప్రకారం ఈ కిడ్నాప్ జరిగిందని వివరించారు. 


గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తన ఫోన్ కాల్స్ రికార్డు తీసుకోవచ్చని... ఎప్పుడూ హేమంత్‌తో మాట్లాడలేదన్నారు ఎంవీవీ. విశాఖలో రక్షణ లేదు అనడం కరెక్ట్ కాదని... అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని అభిప్రాయపడ్డారు. పోలీసులు కిడ్నాప్ ఘటన జరిగిన రెండు గంటలులో ట్రేస్ అవుట్ చేశారని తెలిపారు. నేరాలు, మత ఘర్షణలు వంటివి అన్నీ ప్రభుత్వాల హయాంలో జరిగాయి.. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయన్నారు. 


బిజినెస్ విషయంలో తాను హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోతున్నట్టు స్పష్టం చేశారు. వ్యాపారం విషయంలో ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. మనస్తాపంతో మాత్రమే ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశ్యంతో హైదరాబాద్‌కి షిప్టు అవుతున్నట్టు పేర్కొన్నారు. 


సహచర ఎంపీ రఘురామ కృష్ణరాజుపై ఘాటుగా కామెంట్ చేశారు ఎంవీవీ.  ఆయన ఏమి మాట్లాడుతున్నారో తెలియదని అన్నారు. ఒక ఎంపీ ఫ్యామిలీ కిడ్నాప్ అయి ఇబ్బందుల్లో ఉంటే అలా మాట్లాడటం దారుణమన్నారు. జనసేన, చంద్రబాబు లాంటి వాళ్లు మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఆయన పాలనలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తు చేశారు. పవన్ మాట్లాడుతూ తప్పు చేసిన వారిని ఎన్ కౌంటర్ చేసేయాలని అన్నారని.. రాజేష్‌పై 45 కేసులు, హేమంత్‌పై 12 కేసులు ఉన్నాయని తెలిపారు. 


ఇప్పటి వరకు వంద నిర్మాణాలు చేశామని ఎక్కడా చెడ్డపేరు రాలేదన్నారు. కిడ్నాప్ అయిన బాధితులు చనిపోవాలని అనుకుంటున్నారా అని మీడియాను నిందించారు. బీజేపీ విష్ణు కుమార్ రాజు తనపై ప్రెస్‌మీట్ పెట్టి, మరలా తన ఆఫీసుకి పరామర్శకు వస్తానని కబురు పంపారని తెలిపారు. కిడ్నాప్‌లో కుట్ర కోణం దాగివుందని... ఎంపీ చెప్పింది సినిమా కథలా ఉందన్నారని తనకి కూడా సినిమా ట్విస్ట్‌లానే అనిపించిందన్నారు.