ఏపీ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే జగనన్నకు చెబుదాం ప్రోగ్రామ్‌తో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తోంది. వాటికి సంబంధిత శాఖలు రియాక్ట్ అవుతున్నాయి. దీనికి అనుబంధంగా జగనన్న సురక్ష అనే మరో కార్యక్రమం చేపట్టింది. జూన్ 23 నుంచి జరిగే ఈ కార్యక్రమంలో ప్రభుత్వం సిబ్బందితోపాటు ప్రజాప్రతినిధులు పాల్గొనేలా ప్రయత్నాలు చేస్తోంది. 


జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ పరిధిలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేయబోతోంది. ఈ కార్యక్రమాన్ని జులై 1 నుంచి స్టార్ట్ చేయనుంది. ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు అందజేయడమే ఈ శిబిరాల లక్ష్యం. స్పాట్‌లోనే సర్టిఫికేట్స్‌ ఇచ్చే కార్యక్రమం నెల రోజుల పాటు సాగనుంది. 


క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణ పరిష్కారం కోసం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన విధివిధానాలను అధికారులు ఇప్పటికే వివరించారు. అందులో భాగంగా నిర్వహించే శిబిరాలకు మండలస్థాయి అధికారులంతా హాజరుకావాల్సి ఉంటుంది. జులై 1 నుంచి సచివాలయాల వారీగా శిబిరాలను ఏర్పాటు చేయబోతున్నారు. ఆయా మండల అధికారులు చర్చించుకొని ప్రత్యేక షెడ్యూల్ ప్రకటిస్తారు. 


శిబిరాల్లో ఎలాంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎలాంటి సర్టిఫికేట్స్‌ ఇస్తారు.. ఏ అంశాలు ప్రస్తావించాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించబోతున్నారు. ప్రతి వార్డు గ్రామ సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకొని శిబిరాలకు రప్పించాల్సి ఉంటుంది. జూన్ 24వ తేదీ నుంచి ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తారు. సర్టిఫికేట్స్‌ జాబితాను కూడా సేకరిస్తారు. 


ప్రతి మండలంలో రెండు వేర్వేరు టీంలను ఏర్పాటు చేస్తారు. ప్రతి టీంలో ముగ్గురు అధికారులు ఉంటారు. 24 గ్రామాల కంటే ఎక్కువ ఉంటే మూడు టీంలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎక్కువ వార్డు సచివాలయాలు ఉండే నగరాలు, సిటీలకు దగ్గరగా ఉండే సచివాలయం క్లస్టర్‌గా చెప్తారు. దీని పరిధిో ఐదు వార్డు సచివాలయాలు ఉంటాయి. క్యాంపుల పర్యవేక్షణకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక అధికారులు ఉంటారు. వారిని జిల్లా కలెక్టర్లు నియమిస్తారు. గ్రామ సచివాలయాల భవనాల్లో లేదా... సమీప ప్రభుత్వ బిల్డింగ్‌లోనే క్యాంపులు నిర్వహించారు. 


ఏ రోజు ఏ సచివాలయం పరిధిలో క్యాంపు నిర్వహిస్తున్నారో ముందస్తుగా అందరికీ తెలిసేలా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. దీనికి అనుగుణంగానే సిబ్బంది, వలంటీర్లకు శిక్షణ ఇస్తారు. సచివాలయాల వద్ద నిర్వహించే క్యాంపుల్లో 11 సర్వీసులకు ఎలాంటి ఫీజులు వసూలు చేయకూడదని ప్రభుత్వం పేర్కొంది. మ్యుటేషన్‌ ఆఫ్‌ ట్రాన్సాక్షన్‌కు సంబంధించి పాస్‌ పుస్తకాల జారీకి స్టాట్యుటరీ చార్జీలు వసూలు చేస్తారు.


క్యాంపుల్లో అందించే సర్టిఫికేట్స్ ఇవే
ఇంటిగ్రేటెడ్‌ సర్టిఫికెట్లు (కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు)  
ఆదాయ ధ్రువీకరణ పత్రం 
డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌
మరణ ధ్రువీకరణ పత్రం 
మ్యుటేషన్‌ ఫర్‌ ట్రాన్సాక్షన్‌ , మ్యుటేషన్‌ ఫర్‌ కరక్షన్స్‌ 
వివాహ ధ్రువీకరణ పత్రం 
ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్లు  
ఆధార్‌కార్డులో మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌  
కౌలు గుర్తింపు కార్డులు (సీసీఆర్‌సీ)  
కొత్త రేషన్‌కార్డు లేదా రేషన్‌కార్డు విభజన   
ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో కొంత మంది సభ్యుల పేర్ల తొలగింపు.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial