Vizianagaram News: కన్నబిడ్డ చనిపోయి వారం రోజులు అయింది. ఇంతలో భార్య కూడా కాలం చేసింది. ప్రాణం కంటే ఎక్కువైన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లే దారి లేక ఆ గిరిజనుడు చేతుల్లోనే తీసుకెళ్లిన దుస్థితి మరొకటి వెలుగులోకి వచ్చింది.  


శృంగవరపుకోటకు చెందిన ఓ గిరజనుడి కన్నబిడ్డ చనిపోయి వారం రోజులైంది. ఇంతలోనే బాలింత అయిన భార్యా కన్నుమూసింది. గుండె పగిలి తన్నుకువస్తున్న దుఃఖాన్ని పంటి బిగువున భరిస్తూ... భార్య మృతదేహాన్ని బైక్‌పై పెట్టుకుని ఇంటి బాట పట్టాడా భర్త. సగం దూరం వెళ్లిన తర్వాత బైక్‌ కూడా వెళ్లలేని దుస్థితి. అక్కడి నుంచి ఒక కట్టెకు మృతదేహాన్ని కట్టుకుని మోసుకుంటూ ఇంటికి చేరిన దీనస్థితి. 


విజయనగరం జిల్లాలో ఒక గిరిపుత్రుడు ఘోష ఇది. జిల్లాలోని శృంగవరపుకోట మండలం గిరిశిఖర గ్రామమైన బొడ్డవర పంచాయతీ పరిధిలోని చిట్టంపాడు గ్రామానికి చెందిన బాలింత మాదల గంగమ్మ, ఆమె ఆరు నెలల పాప అనారోగ్యం పాలయ్యారు. ఈ నెల ఐదో తేదీన వారిద్దరిని గంగమ్మను ఆసుపత్రిలో చేర్చాడు భర్త గంగులు. 


అనారోగ్యం పాలైనా భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి కూడా నానా బాధలు పడ్డాడు గంగులు. తోటి గిరిజనుల సాయంతో డోలీపై ఐదు కిలోమీటర్లు మోసుకుంటూ మైదాన ప్రాంతానికి తెచ్చారు. అక్కడి నుంచి ఎస్‌.కోట సీహెచ్‌సీకీ తరలించారు. గంగమ్మ ఆరోగ్యం కుదుటపడడంతో ఆమెను డాక్టర్లు ఇంటికి పంపేశారు. చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించగా ఈనెల 7న చిన్నారి మృతి చెందింది.
బిడ్డ చనిపోయిన మనోవ్యధతో భార్య కూడా అనారోగ్యం పాలైంది. మళ్లీ ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ చనిపోయింది. అక్కడ నుంచి భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లాడనికి అవస్థలు పడ్డాడా భర్త.