Andhra Pradesh news: బీజేపీ(BJP) అధిష్ఠానం ఆంధ్రప్రదేశ్‌()Andhra Pradeshలో జరగబోయే ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓవైపు ప్రత్యర్థి పార్టీలు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. మరోవైపు పొత్తులపై కూడా క్లారిటీతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల నాటికి ఏం చేయాలనే స్పష్టత లేకుండా బీజేపీ ఉందని ప్రచారం నడుస్తోంది. అందుకే ఇలాంటి దుష్ప్రచారాన్ని కట్టడి చేసి శ్రేణులను సమాయత్తం చేసేలా బీజేపీ కార్యచరణ సిద్ధం చేయబోతోందని టాక్. 


పొత్తుతో సంబంధం లేకుండా


పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయంతో సంబంధం లేకండా ఎలా ప్రజల్లోకి వెళ్లాలి.. ఎలాంటి అంశాలు లేవనెత్తాలనే విషయాలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. పొత్తు ఉన్నా లేకపోయినా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో మరింత బలపడేలా ప్లాన్ చేస్తున్నారు. జనసేనతో పొత్తు ఉన్నట్టు ప్రకటిస్తున్నా ఆ పార్టీ నుంచి మాత్రం అంత సానుకూలత లేదని టాక్. అందుకే పొత్తుల ఎత్తులను పట్టించుకోకుండా ప్రజల్లో ఉండేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. 


క్లస్టర్‌వారీగా భేటీలు


ఈ మధ్యే పార్లమెంట్‌ నియోజకవర్గాల క్లస్టర్ ఇన్‌ఛార్జీలతో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశమయ్యారు. ఐదేసీ పార్లమెంటు స్థానాలను కలిపి మరో క్లస్టర్‌గా చేసారు. దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులను ఇన్‌ఛార్జిలుగా నియమించారు. వీళ్లతో ఢిల్లీలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహప్రతివ్యూహాలపై చర్చించారు. ఎన్నికల నిర్వహణ కమిటీల, క్షేత్రస్థాయిలో బూత్ కమిటీలు, శక్తి కేంద్రాలు ఎలాంటి ప్లాన్‌తో వెళ్లాలో వివరించారు. 


పోటీ చేసే జాబితా రెడీ
పొత్తులపై స్పష్టత లేకపోయినా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నవారి జాబితాను అధినాయకత్వానికి చేరింది. ఈ మధ్య కాలంలో రాష్ట్ర నాయకులు జిల్లాల్లో పర్యటించి ఆశావాహుల లిస్ట్ రెడీ చేశారు. రాష్ట్ర స్థాయిలో వడపోత తర్వాత ఫిల్టర్ జాబితాను ఢిల్లీ పంపించారు. దీనిపై అక్కడ మరోసారి కసరత్తు పూర్తి చేసి పోటీదారులను ప్రకటిస్తారు. 


మరోవైపు పొత్తులపై కూడా సీరియస్‌గానే దృష్టి పెట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య జాతీయ సహసంఘటనా మంత్రి శివప్రకాశ్‌ విజయవాడలో నేతలతో సమావేశమయ్యారు. పొత్తులపై నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. వాటిని షీల్డ్ కవర్‌లో జాతీయ నాయకత్వానికి చేరవేశారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో సమావేశమై అధినాయకత్వం ఓ నిర్ణయానికి రానుంది. 


మరోవైపు క్లస్టర్‌ వారీగా జాతీయ నేతలు ఏపీలో పర్యటించనున్నారు. ముందుగా జేపీ నడ్డా వస్తారు. అనంతరం హోంమంత్రి అమిత్‌షా రానున్నారు. తర్వాత రాజ్‌నాథ్ సింగ్ పర్యటిస్తారు. ముగ్గురు కూడా వేర్వేరు తేదీల్లో వేర్వేరు క్లస్టర్స్‌ సమావేశాల్లో పాల్గొంటారు. ఒకట్రెండు రోజుల్లో ఈ పర్యటనలు ఖరారు కానున్నాయి.