Jaggaiyapet MLA Samineni Udayabhanu is likely to join Janasena :  వైఎస్ఆర్‌సీపీలో వలసల చర్చ జోరుగా సాగుతోంది. తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్య పేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతానని ఇప్పటికే ప్రకటించిన  మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరికి సామినేని ఉదయభాను సన్నిహితుడు.  బాలశౌరి .. పార్టీ మారాలని సామినేని ఉదయభానుపై ఒత్తిడి తెస్తున్నట్లుగా తెలుస్తోంది. 


మంత్రి పదపవి దక్కలేదని అసంతృప్తి - నియోజకవర్గంలో వ్యతిరేకత


జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సీనియర్ నేత. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. అయితే  ఆయనకు ఈ సారి టిక్కెట్ ఉంటుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. నియోజకవర్గంలో ఆయనపై చాలా వ్యతిరేకత ఉందని.. అందుకే కొత్త అభ్యర్థి కోసం చూస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ జగ్గయ్య పేట నుంచి పోటీ చేయాలని హైకమాండ్ సూచించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో తనకు టిక్కెట్ ఇవ్వరేమో అన్న సందేహంలో ఉదయభాను ఉన్నారు. నిజానికి వైసీపీ గెలిచిన తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలు ఆయన పేరు పరిగణనలోకి తీసుకోలేదు. అయితే విప్ పదవి, టీటీడీ బోర్డు మెంబర్ పదవి ఇచ్చారు. కానీ మంత్రి కావాలన్న ఆయన లక్ష్యం నెరవేరలేదు. 


జనసేన నుంచి విజయవాడ వెస్ట్ టిక్కెట్ ఆఫర్                           


జనసేన పార్టీలో చేరితే జగ్గయ్య పేట నుంచి కాకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టిక్కెట్ కేటాయిస్తామని జనసేన వర్గాలు ఆఫర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ జససేనకు కేటాయిస్తారని చెబుతున్నారు. అయితే అక్కడ ఐదేళ్లుగా పోతిన మహేష్ పని చేసుకుంటున్నారు. ఆయనకే టిక్కెట్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు సామినేని ఉదయభాను పార్టీలో చేరి టిక్కెట్ ఎగరేసుకుపోతే ఎలా అని ఆయన వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో జనసేన నేతలు... సామినేని ఉదయభానుతో చర్చలు జరుపుతున్నారు. పోతిన మహేష్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. 


అనుచరులతో చర్చలు జరుపుతున్న ఉదయభాను 


సామినేని ఉదయభాను కూడా తన క్యాడర్ తో మాట్లాడుతున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చల్లో ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని.. టీడీపీ, జనసేన కూటమికి మంచి అవకాశాలు ఉంటాయని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న సమయంలో జనసేన తరపున సీనియర్ నేతగా ప్రభుత్వం ఏర్పడితే కేబినెట్‌లోనూ చోటు దక్కవచ్చని ఆయనను మోటివేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై ఆయన రెండు, మూడు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 


వైసీపీలోనే  ఉన్నానంటున్న  ఎమ్మెల్యే


జనసేనలో చేరుతున్నారని విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తరుణంగా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను స్పందించారు. అలాంటిదేమీ లేదని.. పుకార్లు నమ్మవద్దని కోరారు. తాను వైసీపీలోనే ఉన్నానన్నారు.