Modi inaugurated NASIM: నేషనల్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్)ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లో శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో 44వ జాతీయ రహదారికి ఆనుకుని 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ శిక్షణ కేంద్రాన్ని రూ.541 కోట్లతో నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నాసిన్ ప్రత్యేకత ఏంటంటే
బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి ఈ అకాడమీకి గంట సేపట్లో చేరుకునేంత దూరం ఉంటుంది. ఐఏఎస్‌లకు ముస్సోరి, ఐపీఎస్‌లకు హైదరాబాద్ లో శిక్షణ ఇచ్చే తరహాలోనే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ (ఐఆర్‌ఎస్)కు ఎంపికైన వారికి ఈ నాసిన్ లోనే ట్రైనింగ్ ఇస్తారు. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ నాలుగు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి - ప్రధాని
సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ.. పాలసముద్రం ప్రాంత ప్రత్యేకతను హైలైట్ చేశారు. ఇది ఆధ్యాత్మికత, దేశ నిర్మాణం, సుపరిపాలనతో ముడిపడి ఉందని.. భారతదేశ వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయిబాబా జన్మస్థలం, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు, ప్రఖ్యాత తోలుబొమ్మలాట కళాకారుడు దళవాయి చలపతిరావు, అద్భుతమైన విజయనగర సామ్రాజ్యం సుపరిపాలన ఈ ప్రాంతం నుండి స్ఫూర్తిదాయకమైన మూలాలుగా ఆయన పేర్కొన్నారు. నాసిన్ యొక్క కొత్త క్యాంపస్ సుపరిపాలన యొక్క కొత్త కోణాలను సృష్టిస్తుందని.. దేశంలో వాణిజ్యం, పరిశ్రమలకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
మహాత్మా గాంధీని ఉటంకిస్తూ, రామరాజ్య ఆలోచన నిజమైన ప్రజాస్వామ్యం వెనుక ఉన్న భావన అని ప్రధాని అన్నారు. నాలుగు స్తంభాలపై రామరాజ్యం స్థాపించబడిందని, ఇక్కడ ప్రతి ఒక్కరూ తల ఎత్తుకుని, గౌరవంగా నడవవచ్చని, ప్రతి పౌరుడిని సమానంగా చూస్తారని అన్నారు. అణగారిన వారికి రక్షణ లభిస్తుందని, ధర్మానికి అత్యంత ప్రాధాన్యం ఉందని ఆయన నొక్కి చెప్పారు. "21వ శతాబ్దంలో, ఈ ఆధునిక సంస్థల నియమాలు, నిబంధనలను అమలు చేసే నిర్వాహకులుగా, మీరు ఈ నాలుగు లక్ష్యాలపై దృష్టి పెట్టాలి, వాటిని గుర్తుంచుకోవాలి" అని ప్రధాన మంత్రి పిలుపు ఇచ్చారు.
అంతకుముందు లేపాక్షి దర్శనం
సత్యసాయి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో భాగంగా తొలుత భారీ భద్రత మధ్య ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్ర స్వామి ఆలయానికి మోదీ చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణ కుంభాల ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికారు. వీరభద్రేశ్వర స్వామికి ప్రధానమంత్రి మోడీ చేతుల మీదుగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీతా అపహరణ ఘట్టాన్ని తోలుబొమ్మల ఆట ద్వారా ప్రదర్శించారు. తోలుబొమ్మలాటను వీక్షించిన నరేంద్ర మోడీ సీత రామస్వామి నామస్మరణ చేస్తూ కూర్చున్నాడు. ఆలయంలో గల వీరభద్ర స్వామి, దుర్గాదేవి, ఏడు శిరస్సుల నాగేంద్రుడు, ఏకశిలా నంది విగ్రహం, వేలాడే స్తంభం, విరుపన్న రక్త చాయలు, అర్ధాంతంగా ఆగిన కళ్యాణ మండపం, సీత దేవి పాదం, నాట్య మండపంలో రాతి స్తంభాల పై చెక్కిన వివిధ రూపాల దేవతామూర్తుల శిల్పాలను ప్రధానమంత్రి మోడీ వీక్షించారు.
భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో లేపాక్షి దేవాలయం చాలా అద్భుతంగా ఉందని ఇక్కడ ఉన్న చిత్ర ,శిల్పాలు చూడడానికి చూడముచ్చటగా ఉన్నాయని ఆలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ కనపరస్తానని ప్రధానమంత్రి మోడీ పేర్కొన్నారు. ఆలయం వెలుపలికి వచ్చిన అనంతరం ప్రధానమంత్రి మోడీ ప్రజలకు అభివాదం తెలియజేస్తూ పెనుగొండ నియోజకవర్గం పాలసముద్రం గ్రామంలోని నాసిక్ అకాడమీ ప్రారంభించేందుకు బయలుదేరారు.