మాజీ మంత్రి, వైసిపీ నేత కొడాలి నాని రాజకీయంగా ఎదిగారంటే అది ఎన్టీఆర్ పెట్టిన భిక్ష అన్నారు టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. విశాఖ పట్నంలో విలేకరులతో మాట్లాడుతూ.. మహానుభావుడు ఎన్టీఆర్ కడుపున పుట్టిన ఆడ బిడ్డ మీద ఇష్టానుసారంగా మాట్లాడం సరి కాదన్నారు. పాలకి, సారాయికి తేడా తెలియని మనుషులు అధికార వైసిపీలో ఉన్నారంటూ మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. ఏపీ క్యాబినెట్ లో రాష్ట్ర సమస్యలు మాట్లాడటం మానేసి, ప్రతిపక్ష నేత చంద్రబాబు మీద మాట్లాడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కేవలం ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే అమ్మతనంపై తప్పుగా మాట్లాడితే దిశా చట్టం కింద కేస్ పెట్టరా అని ప్రశ్నించారు. కొడాలి నాని తన ఇంటి ముందు రోడ్లు వేయించుకోలేరు గాని చంద్రబాబు, లోకేష్ లను దూషిస్తున్నారని మండిపడ్డారు. కొడాలి నానికి చిత్తశుద్ధి ఉంటే భువనేశ్వరికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
అమరావతి యాత్రపై అనిత కీలక వ్యాఖ్యలు:
విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే, మంత్రులు అన్నం తింటున్నారా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని విషయం పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ ను ఇక్కడే ఉంచే ప్రయత్నం చెయ్యాలని సూచించారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులకు అన్యాయం చేయవద్దన్నారు. రైతులను మాత్రం ఏమైనా చేస్తామని బెదిరిస్తున్నారని, ఇది సరికానద్నారు. దండయాత్ర అంటే ఇదికాదనీ.. నిజానికి రైతులు దండయాత్ర చేయాలి అనుకుంటే ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి కూడా బయట తిరగలేరని గుర్తుంచుకోవాలన్నారు. అమరావతి రైతు యాత్రలో ఎక్కువ మంది మహిళలే పాల్గొంటున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారనీ,
రుషి కొండ గుండు గిసినట్టు దోచేశారని ఆరోపించారు.
రాజీనామా చేయండి
ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డలుగా చెప్పుకునే వారు ఈ మూడేళ్ళు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఉన్న మంత్రులు తక్షణమే రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం రాజధాని పేరు చెప్పి ఒక్క ఇటుక వెయ్యలేదని ఎద్దేవా చేశారు. మూడు రాజధానులు వ్యవహారం ముగిసిన అధ్యాయమనీ, దాన్ని జగన్ తనకుతానే ముగించారని వంగలపూడి అనిత అన్నారు.