గడచిన కొన్ని రోజులుగా విశాఖకు వందే భారత్ రైలు నడవబోతుంది అని ప్రచారం విస్తృతంగా సాగింది. వచ్చే నెలలోనే ఆ సెమీ బుల్లెట్ ట్రైన్ వైజాగ్‌కు వచ్చేస్తుంది అని ఇక్కడి ఉత్తరాంధ్ర వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అలాంటి వారికి గట్టిషాకే ఇచ్చింది కేంద్రం. కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వందే భారత్ రైలు వైజాగ్‌కు రావడం లేదు. అది కేవలం సికింద్రాబాద్ నుంచి విజయవాడ మధ్య మాత్రమే తిరగబోతోంది. ఇంకా టైమింగ్స్ , టికెట్ ధరలు ఖరారు కాకపోయినా అతి త్వరలోనే వందే భారత్ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి బెజవాడ మధ్య పట్టాలెక్కనుంది. హైదరాబాద్ నుంచి తిరుపతి మధ్య కూడా మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్ తిరగనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ట్రైన్ రూట్‌పై అధికారిక సమాచారం లేకపోయినా... ఇది కూడా ప్రచారంగా చెబుతున్నారు. 


బోగీల సమస్య వల్లే 


వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో ఒక్కోటి 16 బోగీలతో నడుస్తున్నాయి. ఒక్కో ట్రైన్ 1128 మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. ఏకంగా గంటకు 160 కిలోమీటర్ల స్పీడ్‌తో నడుస్తున్న  ఈ రైళ్లు పట్టాలు ఆధునీకరించిన తర్వాత త్వరలోనే గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్‌తో ప్రయాణించనున్నాయి. దీనివల్ల ట్రావెలర్స్‌క ఎంతో సమయం కలిసి రానుంది. అలానే ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లో అత్యాధునిక సౌకర్యాలు లభిస్తున్నాయి. ఆటోమేటిక్ డోర్స్ , స్మోక్ అలారమ్స్ , సీసీ టీవీ కెమెరాస్, మోడరన్ టాయిలెట్స్ , వైఫై లాంటి ఫెసిలిటీస్ ఈ ట్రైన్‌లో ఉంటాయి. 


అయితే వందేభారత్ ట్రైన్స్‌కు తగినట్టుగా చాలినన్ని బోగీలు ఇంకా అందుబాటులోకి రాలేదు. సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వరకూ వందేభారత్ ట్రైన్ నడపాలంటే అటూ, ఇటూ తిరిగే రెండు ట్రైన్స్ కావాలి. అదే సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకూ అయితే ఒకే ట్రైన్ ఇంటర్‌సిటీలా రెండువైపులా నడపొచ్చు. ఈ సమీకరణాల వల్లే ప్రస్తుతానికి సికంద్రాబాద్ నుంచి విజయవాడ వరకే వందే భారత్ ఎక్స్ప్రెస్ నడపబోతోంది రైల్వే. తగినన్ని బోగీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత మాత్రమే దానిని వైజాగ్ వరకూ పొడిగించనున్నారు. దానితో విశాఖ వరకూ వందేభారత్  హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ త్వరలోనే నడవబోతోంది అని ఎదురుచూస్తున్న వైజాగ్ వాసులకు నిరాశ ఎదురవుతోంది . 


ప్రస్తుతానికి 6సర్వీసులు -త్వరలో మరో 21


ప్రస్తుతానికి మనదేశంలో 6 వందే భారత్ ట్రైన్స్ తిరుగుతున్నాయి . న్యూ ఢిల్లీ - వారణాసి ,న్యూఢిల్లీ -వైష్ణోదేవి , ముంబై -గాంధీనగర్ ,  న్యూ ఢిల్లీ - అందౌరా (హిమాచల్ ప్రదేశ్ ), చెన్నై -మైసూర్ ,బిలాస్ పూర్ -నాగపూర్ మధ్య వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి . త్వరలోనే దేశంలో మరో 21 రూట్లలో వీటిని నడిపేందుకు రైల్వే రెడీ అవుతోంది. అయితే ఇవన్నీ కేవలం సీటింగ్ ఫెసిలిటీని మాత్రమే కలిగి ఉంటాయి. ఈ 21 కాకుండా న్యూ ఢిల్లీ - ముంబై , ముంబై -ఫిరోజ్ పూర్, వారణాసి -ముంబై మధ్య ఈ స్లీపర్ బోగీలతో కూడిన ట్రైన్స్ నడపబోతోంది రైల్వే శాఖ