Janasena host Yuva Shakti on 12 January:
- యువతలో రాజకీయ చైతన్యం నింపడానికే జనసేన 'యువ శక్తి'
- యువ శక్తి విజయవంతానికి ప్రత్యేక కమిటీలు
- ఉత్తరాంధ్ర నాయకులతో కలిసి యువశక్తి పోస్టర్ ఆవిష్కరణ
- శ్రీకాకుళం మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
ఉత్తరాంధ్ర కళా వైభవం ఉట్టిపడేలా, వారి సంప్రదాయాలు ప్రతిబింబించేలా.. యువత సత్తా చాటేలా జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించనుందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువత కోసం వచ్చే జనవరి 12న రణస్థలంలో నిర్వహించనున్న యువశక్తి ఈవెంట్‌కు సంబంధించిన పోస్టర్ ను శ్రీకాకుళంలో నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పార్టీ నేతలతో కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు.
‘ఉత్తరాంధ్ర ప్రాంతంపై జనసేన పార్టీ స్పెషల్ ఫోకస్ చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రాంతంలో మంచి నాయకత్వాన్ని పెంచే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నాం. అందులో భాగంగా జనవరి 12న యువశక్తి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఉత్తరాంధ్ర సంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమంతో పాటు యువతలో రాజకీయ చైతన్యం కలిగించే కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు’ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
పోలీస్ ఉద్యోగార్థుల వయోపరిమితి పెంచాలి
‘ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఉపాధితో పాటు చదువుకోవడానికి వలసలు వెళ్లాల్సి వస్తోందిన యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డా.బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలో లెక్చరర్ల కొరత తీవ్రంగా వేధిస్తోందని, హాస్టల్ లో సరైన సదుపాయాలు లేవని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అవుతున్నా ఇప్పటివరకూ ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదు. కొత్తగా పేరు రిజిస్టర్ చేసుకున్న యువతకు జాబ్ కార్డులు ఇవ్వొద్దని జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారులకు ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు ఇవ్వడం దుర్మార్గమైన చర్య. ప్రతి ఏడాది జనవరిలో జాబ్ క్యాలెండర్ అని హామీ ఇచ్చి సీఎం జగన్ మాట తప్పారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడటంతో పోలీస్ శాఖలో ఉద్యోగాలంటూ హడావుడి చేస్తున్నారని, మూడేళ్లు ఉద్యోగ ప్రకటనలు చేయకుండా యుతను మానసికంగా వేధించారు. పోలీస్ ఉద్యోగార్థుల వయో పరిమితి మూడేళ్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. వారి న్యాయపరమైన డిమాండ్‌కు జనసేన అండగా ఉంటుందని’ జనసేన ఓ ప్రకనటలో పేర్కొంది.
గ్రామ సారథుల నియామకం అప్రజాస్వామికం
వైసీపీ అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. దాంతో 2.5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పించామన్నారు. నెలకు రూ.5 వేలు గౌరవ వేతనం అందించింది. తమ ఉద్యోగాలు రెగ్యూలరైజ్ అవుతాయనే ఆశతో చాలీచాలని జీతాలకు యువత సేవలు అందించారు. కానీ వీళ్లపై పెత్తనం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా సారథులను నియమించాలనుకోవడం దుర్మార్గమైన చర్య. దేని కోసం ఇంటింటికి వెళ్లి సమాచారం సేకరిస్తున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.